
అసోం ఎన్నార్సీ డేటా గల్లంతు
సాంకేతిక సమస్య అంటున్న హోంశాఖ
గువాహటి: జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) వెబ్సైట్ నుంచి అసోం పౌరుల తుది జాబితాకు సంబంధించిన డేటా గల్లంతైంది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఐటీ సంస్థతో కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో డేటా గల్లంతైందని ఎన్నార్సీ అధికారులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతేడాది ఆగస్టులో అసోం ఎన్నార్సీ డేటాను అధికారిక వెబ్సైట్ www.nrcassam.nic.inలో అప్లోడ్ చేశారు. ఇందుకోసం ప్రముఖ ఐటీ సంస్థ విప్రో క్లౌడ్ సర్వీస్ సేవలు అందించింది. అయితే క్లౌడ్ సేవల కోసం నాటి రాష్ట్ర కో-ఆర్డినేటర్ విప్రోతో చేసుకున్న ఒప్పందం గతేడాది అక్టోబరు 19తో ముగిసింది. ఆ తర్వాత ఐటీ సంస్థ తన సేవలను నిలిపివేసిందని ఎన్నార్సీ ప్రస్తుత కో-ఆర్డినేటర్ హితేశ్ దేవ్ శర్మ తెలిపారు. దీంతో గత డిసెంబరు 15 నుంచి డేటా అదృశ్యమైందని పేర్కొన్నారు.
డిసెంబరు 24న తాను ఎన్నార్సీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టానని.. డేటా అదృశ్యమైన విషయం తెలియగానే విప్రోను సంప్రదించినట్లు హితేశ్ తెలిపారు. ‘ఒకసారి విప్రో తన సేవలను పునరుద్ధరిస్తే ఎన్నార్సీ డేటా మళ్లీ వెబ్సైట్లో దర్శనమిస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం’ అని హితేశ్ చెప్పారు.