Published : 12 Feb 2020 13:52 IST

కొవిడ్‌-19 వైరస్ ఇంకా ఎంతమందికి..?

లండన్‌: కొవిడ్‌-19(కరోనా వైరస్గా‌) ఎప్పుడు తగ్గుతుంది? చైనాలో దీనివల్ల సంభవిస్తున్న మరణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుంది?వీటన్నింటికీ ఇప్పటికైతే కచ్చితమైన సమాధానాలు లేవనే చెప్పాలి. కానీ, కొత్తగా సోకుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన కాస్త ఊరట కలిగిస్తున్నా.. పూర్తిగా ఎప్పుడు అదుపులోకి వస్తుందన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. అయితే ఈ పరిణామాలపై హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ రోగవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ గాబ్రియెల్‌ లియాంగ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈయన గతంలో సార్స్‌ని అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ మెడిసిన్‌ విభాగం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ కొవిడ్‌-19 వైరస్ ఇంకా ఎంతదూరం ప్రయాణిస్తుందనే ప్రశ్న నిపుణుల్ని తొలచివేస్తోందని లియాంగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే.. చాలా మంది విశ్లేషణల ప్రకారం ఒక్క వైరస్‌ బాధితుడి వల్ల సగటున 2.5 మందికి సంక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ లెక్కన వైరస్‌ను అదుపు చేయలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 60-80శాతం మంది దీని బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ఒకశాతం మరణాల రేటు ఇలాగే కొనసాగినా.. ప్రాణనష్టం తీవ్ర స్థాయిలోనే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జెనీవాలో తాజా వైరస్‌పై నిర్వహించబోయే సదస్సుకు వెళుతూ ఓ ప్రముఖ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా సహా పలు దేశాలు తీసుకుంటున్న చర్యలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చైనా తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తున్నాయన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కార్యాలయాల మూసివేత, రవాణా నిషేధం వంటి చర్యలతో వైరస్‌ను ఎంతవరకు కట్టడి చేయగలమన్నది చాలా ముఖ్యమైన అంశమన్నారు. ఇలా ఎంతకాలం ఆంక్షలు విధించగలమన్న అంశంపై కూడా దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. ఒకవేళ ఈ చర్యలేవీ పనిచేయనట్లయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే వైరస్‌ను నిరోధించే చర్యలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైరస్‌ సోకి లక్షణాలు బయటిపడని వారిని గుర్తించడమే ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. సమూహంలో ఏ ఒక్కరికి వైరస్‌ సోకినట్లు గుర్తించినా వారందరినీ 14 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచాల్సిందేనన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని