రోజుకూలీ.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు!

అతడో రోజువారీ కూలీ. పనిచేస్తే గానీ పూటగడవదు. అయితేనేం అతడి కష్టాలను గట్టెక్కించేందుకు అదృష్టం లాటరీ రూపంలో తలుపుతట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని....

Published : 12 Feb 2020 16:54 IST

కన్నూర్‌: అతడో రోజువారీ కూలీ. పనిచేస్తే గానీ పూటగడవదు. అయితేనేం అతడి కష్టాలను గట్టెక్కించేందుకు అదృష్టం లాటరీ రూపంలో తలుపుతట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. కేరళకు చెందిన ఓ రోజు కూలీ లాటరీలో రూ. 12కోట్లు గెలుచుకున్నాడు. 

కేరళలోని కన్నూర్‌ జిల్లా పురలిమాలా కురిచియా కాలనీకి చెందిన 55 ఏళ్ల పొరున్నన్‌ రాజన్‌ దినసరి కూలీ. రెక్కడాడితే గానీ డొక్కాడదు. అవసరం కోసం అప్పులు తప్పలేదు. అలా మూడు వారాల క్రితం ఓ రోజు రాజన్‌ రుణం కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో లాటరీ టికెట్‌ సేల్ ఆకర్షించింది. అదృష్టంపై నమ్మకం లేకపోయినా ఎక్కడో ఓ ఆశ టికెట్‌ కొనాలని ప్రేరేపించింది. అలా రూ.300 పెట్టి క్రిస్మస్‌-న్యూఇయర్‌ బంపర్‌ లాటరీ టికెట్‌ కొన్నాడు. అంత ఖరీదు పెట్టి లాటరీ కొన్నానని చెబితే ఇంట్లో వారు ఏమంటారోనని ఎవరికీ చెప్పలేదు. 

గత సోమవారం ఈ లాటరీ విజేతలను సదరు ఏజెన్సీ సంస్థ ప్రకటించగా.. అందులో రాజన్‌ కొన్న టికెట్‌కు బంపర్‌ ఆఫర్‌ తగలింది. ఈ లాటరీలో అతడు ఏకంగా రూ. 12కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్‌. ‘లాటరీ గెలుస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ డబ్బుతో ఇప్పుడు నా అప్పులన్నీ తీరుతాయి. మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. నా కూతుర్ని పై చదువులు చదివించొచ్చు’ అని సంతోషంగా చెబుతున్నాడు రాజన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని