Updated : 13 Feb 2020 14:46 IST

కొవిడ్ 19: ఒక్క రోజే 242 మంది..

వైరస్‌ సోకిన వారిని గుర్తించే విధానంలో మార్పు..

బీజింగ్‌: చైనాలో కొవిడ్‌-19 వైరస్‌ బుధవారం భారీగా విజృంభించింది. హుబెయ్‌ ప్రావిన్సులో నిన్న ఒక్కరోజే 242 మందిని కబలించింది. కొత్తగా మరో 14,840 మంది వైరస్‌ సోకడం గమనార్హం. దీంతో కొవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,355కు చేరింది. ఇక వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 60 వేలు దాటింది. కొవిడ్‌-19 సోకిన వారిని గుర్తించడానికి అవలంబిస్తున్న పద్ధతిని విస్త్రృతపరచడం వల్ల మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని హుబెయ్‌ ప్రావిన్సు అధికారులు తెలిపారు. ఎక్కువ మందికి చికిత్స అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. 

కొత్త విధానం ఏంటీ..?

ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారిని గుర్తించడానికి అత్యాధునిక న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తుండేవారు. ఈ పరీక్షలో పాజిటివ్‌ వస్తేనే వ్యాధి సోకినట్లు ధ్రువీకరించేవారు. ఇందులో వైరస్‌ లక్షణాలు కనబరిచిన వారిని మాత్రం చేర్చేవారు కాదు. కానీ, ఇప్పుడు వైరస్ సోకినట్లు ఏమాత్రం లక్షణాలు బయటపడ్డా.. ధ్రువీకరించిన వారి సంఖ్యలో చేర్చనున్నారు. అంటే సీటీ స్కాన్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ల వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తే వైరస్‌ సోకినట్లుగానే పరిగణించనున్నారు. ఇక పరీక్షలో పాజిటివ్‌ రాకున్నా వైరస్‌ సోకిన లక్షణాలతో మరణించిన వారిని కూడా కొవిడ్‌-19 మరణాల జాబితాలోనే కలపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే బుధవారం మృతుల సంఖ్య, అటు వైరస్ సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

మరో విహార నౌక కాంబోడియా తీరంలో...

కొవిడ్‌-19 భయంతో వెస్టర్‌డ్యామ్‌ అనే మరో విహారనౌకను తమ దేశాల తీరంలో నిలిపి ఉంచడానికి గురువారం ఏకంగా ఐదు దేశాలు తిరస్కరించాయి. ఇది వైరస్‌ తీవ్రతను అద్దపడుతోంది. చివరకు సౌహార్ద హృదయంతో వ్యవహరించిన కాంబోడియా ప్రభుత్వం నౌకను తమ తీరంలో నిలిపి ఉంచడానికి అంగీకరించింది. ఈ నౌకలో దాదాపు 2000 మంది ఉన్నారు. అయితే వీరిలో ఇప్పటివరకు ఎవరికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదు. కాంబోడియా ప్రభుత్వాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతిదేశం నుంచి ఇలాంటి సహకారాన్నే కోరుకుంటున్నామని సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. 

ఇతర వివరాలు...

* వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు బార్సిలోనాలోని నిర్వహకులు తెలిపారు. పెద్ద కంపెనీలు ప్రదర్శన నుంచి తప్పుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

* అమెరికాలో గురువారం మరో కొత్త కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు యూఎస్‌లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 13కు చేరింది. మరోవైపు ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైరస్‌ను గుర్తించేందుకు తప్పుడు వైద్య కిట్లను పంపిణీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. 

* షాంఘైలో జరగాల్సిన చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా-1 రేసు వాయిదా పడింది. అలాగే పాఠశాలలను ఈ నెల మొత్తం మూసివేయనున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

* జపాన్‌ నౌకలో వైరస్ సోకిన ఇద్దరు భారతీయుల్ని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని