Published : 13 Feb 2020 15:10 IST

జపాన్‌ నౌకలో వైరస్ ఎలా వ్యాపిస్తోంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర భయాందోళనను సృష్టిస్తోంది. కొత్తగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని చైనా చెబుతున్నా.. పెరుగుతున్న మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చైనా తర్వాత అత్యధిక మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నది యొకొహామా తీరంలో నిలిపి ఉంచిన ‘డైమండ్ ప్రిన్సెస్‌’ విహార నౌకలోనే. మూడు వేలకు పైగా మంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, ఈ నౌకలో తొలుత ఇద్దరికి సోకిన వైరస్‌ క్రమంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఒకేరోజు 39 మందికి సోకడంతో అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. నౌకలో మొత్తం వైరస్‌ సోకిన వారి సంఖ్య 175కు చేరింది.  వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉండడం విచారకరం. అయితే అక్కడి పరిస్థితులు ఏంటి..?ఎందుకు అంత వేగంగా వ్యాపిస్తోందో భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు సునీల్‌ గుప్తా ఓ ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్‌కు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘ప్రస్తుతం నౌక ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. వేలాది మంది అందులో ఉన్నారు. ఒక నిర్ణీత ప్రదేశంలో వారంతా చాలా సన్నిహితంగా ఉంటారు. అందరూ కామన్‌గా ఉండే భోజనశాల, ఎంటర్‌టైన్‌మెంట్‌ వసతులు, స్నానపు గదులు, స్విమ్మింగ్‌ పూల్‌నే వాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. నౌకలో వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌లో దిగిన ఒక్క వ్యక్తికి సోకిన ఈ వ్యాధి ప్రస్తుతం 175 మందికి సంక్రమించింది.

ఒకేరోజు 39 మందికి సోకడాన్ని బట్టి చూస్తే ఇది ఎంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మెడికల్‌ అసోసియేషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. చైనాలోని ఓ ఆస్పత్రిలో 138 మంది వైరస్‌ బాధితులు చేరారు. వీరిలో 40శాతం మందికి ఆస్పత్రిలోనే వైరస్‌ సోకినట్లు తేలింది. వైరస్‌ను కట్టడి చేయడం కోసం, బాధితుల ప్రాణాలను రక్షించడం కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బంది కూడా ప్రమాదంలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వ్యక్తి శరీరం నుంచి వైరస్ ఎక్కువ స్థాయిలో బయటకు వస్తుంది. ఇక మనం తీసుకునే జాగ్రత్తల్లో లోపాల వల్ల కూడా వైరస్  వ్యాపించే ప్రమాదం ఉంది. వైరస్‌ సోకినా లక్షణాలు బయటపడని వారి నుంచి కూడా వ్యాపిస్తోంది. మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లలో ఉండే వైరస్‌ ఆరు అడుగులు దూరంలో ఉండే వ్యక్తులకు కూడా సోకుతుంది. శరీరం వెలుపల వైరస్ ఎంతవరకు బతకగలుగుతుంది అన్నది ఇంకా తెలియదు. ఒకవేళ మనిషి శరీరం వెలుపల కూడా ఇది మనగలిగితే మరీ ప్రమాదం. ఇలా చాలా కారణాల వల్ల నౌకలో వైరస్ వ్యాపించే అవకాశం ఉంది’’ అని సునీల్‌ గుప్తా వెల్లడించారు.

ప్రస్తుతం నౌకలో వైరస్ సోకిన వారిని టోక్యోలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నౌకలో ఉన్న భారతీయుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని విదేశాంగమంత్రి జయశంకర్‌ వెల్లడించారు. వైరస్‌ బారిన పడిన వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందజేస్తామని తెలిపారు.  

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని