అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై మరోసారి రాకెట్లు విరుచుకుపడ్డాయి. గురువారం రాత్రి కిర్కుక్‌ ప్రావిన్సులో ఉన్న అమెరికా బలగాలున్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో..........

Updated : 14 Feb 2020 11:41 IST

బాగ్దాద్‌: ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లు విరుచుకుపడ్డాయి. గురువారం రాత్రి కిర్కుక్‌ ప్రావిన్సులో అమెరికా బలగాలున్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో దాడి జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఈ పరిణామం చోటుచేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే అమెరికా విమానాలు ఆ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగరడం అక్కడి స్థానికులు గమనించారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత డిసెంబర్‌ 27 తర్వాత ఈ స్థావరంపై దాడి జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో వరుసగా 30 రాకెట్లు విరుచుకుపడడంతో అమెరికా ఉన్నతాధికారి ఒకరు మృతిచెందారు. దీనికి ఇరాన్‌ మద్దతున్న హెజ్బోల్లా తీవ్రవాద సంస్థనే కారణమని అమెరికా ఆరోపించింది. అనంతరం అమెరికా జరిపిన ప్రతీకార దాడిలో 25 మంది హెజ్బోల్లా తీవ్రవాదులు హతమయ్యారు.

ఇరాన్‌ మేజర్ జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా రాకెట్‌ దాడితో హత్యచేసిన తర్వాత.. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నాటి నుంచి ఇరాన్‌ మద్దతున్న వివిధ తీవ్రవాద సంస్థలు అమెరికా స్థావరాలపై దాడికి దిగుతున్నాయి. సులేమానీ మరణం నేపథ్యంలో ఇరాన్‌లో పాటిస్తున్న 40రోజుల సంతాప దినాలు ముగుస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.     


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని