జమ్మూకశ్మీర్‌ యంత్రాంగానికి సుప్రీం నోటీసులు

జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ........

Published : 15 Feb 2020 00:32 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. తన సోదరుడిని ప్రజా భద్రతా చట్టం  కింద నిర్బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సారా అబ్దుల్లా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తొలుత ఏ ప్రాతిపదికన ఒమర్‌ను నిర్బంధించారో చెప్పాలని సారా తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. కారణాలను ఇప్పటికే సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై మీ తరఫున ఎవరైనా జమ్మూకశ్మీర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా? ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయో, లేదో ధ్రువీకరించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన సిబల్‌.. ఎవరూ దీనిపై హైకోర్టును ఆశ్రయించలేదన్నారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీచేసిన న్యాయస్థానం తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై వచ్చే వారం విచారణ చేపట్టాలని సిబల్‌ కోరగా.. రాత్రికి రాత్రి విచారణ చేపట్టలేమని పేర్కొంటూ మార్చి 2కు వాయిదా వేసింది.

గతేడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లాతో పాటు ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా, మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తదితరులను నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని