సులేమానీ హత్య అమెరికా తప్పిదం: ఇరాన్‌

తమ దేశ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని చంపి అమెరికా తప్పు చేసిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ మరోసారి అన్నారు. ‘జనరల్‌ సులేమానీ కంటే అమరల సులేమానీ’........

Published : 15 Feb 2020 12:07 IST

టెహ్రాన్‌: తమ దేశ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని చంపి అమెరికా తప్పు చేసిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ మరోసారి అన్నారు. ‘జనరల్‌ సులేమానీ కంటే అమర సులేమానీ’ ఎక్కువ ప్రభావం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరాక్‌ నుంచి విదేశీ బలగాల్ని తొలగించాలన్న ఇరాన్‌ చిరకాల డిమాండ్‌ దిశగా పరిస్థితులు కదులుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణల తర్వాత ఇరాక్‌లో అమెరికా బలగాల్ని తొలగించాలన్న వాదన ఎక్కువైందని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ వీధుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ‘మ్యూనిచ్‌ భద్రతా సదస్సు’కు వెళ్లిన ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర పాటవాన్ని సమకూర్చుకోవడంలో ఇరాన్‌ దూకుడుగా వ్యవహరించడంపై స్పందిస్తూ.. ‘‘ఐరోపా దేశాలు అర్థవంతమైన చర్యలు చేపడితే అణుకార్యక్రమంపై తమ విధానాల్ని మార్చుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు.

జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా హత్యచేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. సులేమానీతో పాటు ఇరాక్‌కు చెందిన అబు మహదీ అల్‌-ముహందిస్‌ అనే కమాండర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాక్ వీధుల్లో తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. విదేశీ బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని నినదించారు. ఇరాక్‌ పార్లమెంటు సైతం ఆ దిశగా తీర్మానం చేసింది. దీనిపై స్పందించిన అమెరికా.. సైనిక స్థావరాల ఏర్పాటు కోసం వెచ్చించిన ఖర్చును చెల్లిస్తేగానీ కదిలేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు అగ్రరాజ్యం ఆర్థికపరమైన ఆంక్షలకు నిరసనగా.. ఇరాన్‌ తమ అణుకార్యక్రమంలో దూకుడు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు