
‘ప్రేమపెళ్లి చేసుకోం’ అని ప్రమాణం చేయండి
ప్రేమికుల రోజున మహారాష్ట్ర కాలేజీలో విచిత్ర ఘటన
అమరావతి: మహారాష్ట్రలోని ఓ మహిళా కళాశాలలో ప్రేమికుల రోజున విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకోకూడదంటూ ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థినులతో ప్రమాణం చేయించింది.
అమరావతి జిల్లా చండూరు రైల్వే ప్రాంతంలోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థినులంతా కళాశాలకు రాగానే వారితో ప్రేమకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రేమలో పడను. ప్రేమ పెళ్లి చేసుకోను. అంతేగాక, కట్నం తీసుకునేవాడిని కూడా పెళ్లి చేసుకోను’ అని విద్యార్థినులు మరాఠీలో ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. ‘ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? పెళ్లి విషయంలో మన తల్లిదండ్రులే సరైన నిర్ణయం తీసుకుంటారు. మనకు సరిపోయే వ్యక్తిని తీసుకొస్తారు. అందుకే మేం ప్రేమ పెళ్లికి వ్యతిరేకం’ అని చెప్పుకొచ్చారు.