యూరప్‌లో ‘కొవిడ్‌-19’ తొలి మరణం

యూరప్‌లో కొవిడ్‌-19కు సంబంధించి తొలి మరణం చోటుచేసుకుంది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందిన 80ఏళ్ల పర్యాటకులు ఫ్రాన్స్‌లో కొవిడ్‌ వ్యాధితో మరణించినట్లు  ఆరోగ్య మంత్రి అగ్నిస్‌ బుజైన్‌ తెలిపారు.

Updated : 15 Feb 2020 16:48 IST

ప్యారిస్‌‌: యూరప్‌లో కొవిడ్‌-19కు సంబంధించి తొలి మరణం చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చిన చైనాకు చెందిన 80ఏళ్ల పర్యాటకులు కొవిడ్‌ వ్యాధితో మరణించినట్లు ఫ్రాన్స్‌ ఆరోగ్య మంత్రి అగ్నిస్‌ బుజైన్‌ తెలిపారు. జనవరి 16న ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చిన వృద్ధురాలు.. పరీక్షల నిమిత్తం జనవరి 25 నుంచి ఆస్పత్రిలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. చైనా వెలుపల ఇప్పటి వరకు కేవలం మూడు దేశాల్లో (హాంగ్‌కాంగ్‌, జపాన్‌, ఫిలిప్పైన్స్‌) ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కాగా చైనాలో మాత్రం ఈ విష మహమ్మారి కారణంగా మొత్తం 1500మందికి పైగా మృతి చెందారు. 

డైమండ్‌ ప్రిన్సెస్‌లో మరో 67మందికి
జపాన్‌కు చెందిన విహారనౌక డైమండ్‌ ప్రిన్సెస్‌లో ‘కొవిడ్‌-19’ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా మరో 67 మందికి ‘కొవిడ్‌-19’ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని జపాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి కత్సునోబు కటో శనివారం స్వయంగా నిర్దారించారు. ఇప్పటి వరకు నౌకలో వైరస్‌ సోకినవారు 218 మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా సైతం నౌకలో ఉన్న తమ దేశీయులను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమ దేశీయులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని పంపేందుకు శనివారం రంగం సిద్ధం చేసినట్లు అమెరికా రాయబార వర్గాలు పేర్కొన్నాయి. 

దాదాపు పది రోజుల కిందట డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో నుంచి హాంకాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా బయటపడటంతో దాన్ని జపాన్‌లోని యొకోహమా పోర్టులో నిలిపివేశారు. అందులో దాదాపు 3700పైగా ప్రయాణికులు ఉండగా.. అందులో 138 మంది భారతీయులు. వారందరినీ వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే బయటికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. జపాన్‌ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు వారు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని