వారు శాంతికి మిత్రులు..

పోలీసులు శాంతి భద్రతలు కాపాడే సమయంలో.. రెచ్చగొట్టే పరిస్థితులు తలెత్తినప్పటికీ ప్రశాంతంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. కానీ దుర్మార్గుల నుంచి ప్రజలను రక్షించే విషయంలో మాత్రం కఠినంగా ఉండాలని అన్నారు.

Published : 17 Feb 2020 01:42 IST

దిల్లీ: పోలీసులు శాంతి భద్రతలు కాపాడే సమయంలో.. రెచ్చగొట్టే పరిస్థితులు తలెత్తినప్పటికీ ప్రశాంతంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. కానీ దుర్మార్గుల నుంచి ప్రజలను రక్షించే విషయంలో మాత్రం కఠినంగా ఉండాలని అన్నారు. దిల్లీ పోలీసు 73వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎలాంటి వివక్షత చూపకుండా శాంతి, భద్రతలు కాపాడటం పోలీసుల కర్తవ్యం. పోలీసులు ఎవరికీ శత్రువులు కాదు. వారు శాంతికి మిత్రులు. అందుకే వారిని ఎల్లప్పటికీ గౌరవించాలి’ అని హోంమంత్రి వెల్లడించారు.

ఎప్పటికీ పోలీసులను విమర్శించడం సరైంది కాదని.. వారి పాత్రను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలన్న ప్రధాని మోదీ మాటలను షా వివరించారు. నేరాల్ని నివారించడంలో దిల్లీ పోలీసులు ప్రవేశపెడుతున్న పథకాలను ఆయన అభినందించారు. 112 డయల్‌ పథకం, స్మార్ట్‌ పోలీసింగ్‌తో పాటు సైబర్‌ నేరాల నుంచి ప్రజలకు కాపాడేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సౌకర్యాలు కల్పించడం ప్రశంసనీయమన్నారు. దిల్లీ పోలీసు విభాగం ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ నేతృత్వంలో ప్రారంభం కావడం ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా అమిత్‌షా.. 2001 పార్లమెంటు భవనంపై  జరిగిన ఉగ్ర దాడిలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని