దోషులకు డెత్‌ వారెంట్‌.. నిర్భయ తల్లి హర్షం 

‘నిర్భయ’ దోషులకు మార్చి 3న ఉరి తీసేందుకు పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా .......

Updated : 17 Feb 2020 19:13 IST

దిల్లీ: ‘నిర్భయ’ దోషులకు మార్చి 3న ఉరి తీసేందుకు పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యమైందనీ.. అయినా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషం కలిగించిందని చెప్పారు. న్యాయం కోసం తామెంతగానో పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. తన కుమార్తెను కిరాతకంగా బలితీసుకున్న ఆ మృగాళ్లకు చివరకు డెత్‌ వారెంట్‌ జారీ చేయడం హర్షణీయమన్నారు. మార్చి 3న దోషులకు కచ్చితంగా ఉరిశిక్ష అమలుచేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. 

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. మార్చి 3 ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు సోమవారం కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు అనేక ప్రయత్నాలూ చేశారు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి జనవరి 22నే ఈ మృగాళ్లను ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు దిల్లీ కోర్టు రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీచేసినా అదీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మూడోసారి దోషులు ముకేశ్‌కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ నలుగురినీ ఒకేసారి మార్చి 3న ఉరిశిక్ష విధించాలని తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని