ఆ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్

జపాన్‌కు చెందిన విహారనౌక డైమండ్‌ ప్రిన్సెస్‌లో కొత్తగా మరో ఇద్దరికి కొవిడ్‌-19 సోకింది. ఈ మేరకు సోమవారం జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు నిర్దారించారు. తాజాగా ఇద్దరితో కలిపి నౌకలో వైరస్‌ సోకిన భారతీయుల సంఖ్య మొత్తం ఆరుగురికి చేరింది.

Published : 17 Feb 2020 22:47 IST

టోక్యో: జపాన్‌కు చెందిన విహారనౌక డైమండ్‌ ప్రిన్సెస్‌లో కొత్తగా మరో ఇద్దరికి కొవిడ్‌-19 సోకింది. ఈ మేరకు సోమవారం జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు నిర్ధారించారు. తాజాగా ఇద్దరితో కలిపి నౌకలో వైరస్‌ సోకిన భారతీయుల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. ఇప్పటికే వైరస్‌ సోకిన నలుగురు భారతీయులు చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. నౌకలో సోమవారం కొత్తగా 99 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో నౌకలో మొత్తం వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 454కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 

జపాన్‌ విహారనౌక నుంచి పదిరోజుల కిందట హాంకాంగ్‌లో దిగిన వ్యక్తికి కొవిడ్‌ సోకడంతో నౌకను యొకొహామా పోర్టులో నిలిపివేశారు. నౌకలో మొత్తం 3711 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 138 మంది భారతీయులు కావడం గమనార్హం. మరోవైపు ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటివరకు దాదాపు 1700 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

శిబిరం నుంచి ఇంటికి..

చైనాలోని వుహాన్ నుంచి తిరిగొచ్చి ఐటీబీపీ శిబిరంలో ఉంటున్న వారిలో సగం మందిని అధికారులు సోమవారం ఇళ్లకు పంపించారు. తొలివిడతలో భాగంగా దాదాపు 200 మందిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ విజృంభణ కారణంగా వుహాన్‌లో ఉంటున్న 407 మంది భారతీయుల్ని కేంద్రం ప్రత్యేకవిమానంలో వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారు పరీక్షల నిమిత్తం ఐటీబీపీ కేంద్రంలో ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని