నొప్పించినవాళ్లను ఒప్పించేందుకు..

భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ఠాత్మక నిర్ణయాలైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), అధికరణ 370 రద్దును విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఐరోపా సమాఖ్య(ఈయూ) వేదికపై గట్టిగా సమర్థించారు...........

Updated : 21 Dec 2022 17:15 IST

ఈయూ వేదికపై సీఏఏని గట్టిగా సమర్థించిన జైశంకర్‌

బ్రస్సెల్స్‌: భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ఠాత్మక నిర్ణయాలైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), అధికరణ 370 రద్దును విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఐరోపా సమాఖ్య(ఈయూ) వేదికపై గట్టిగా సమర్థించారు. ఈయూతో మెరుగైన సంబంధాలే లక్ష్యంగా బ్రస్సెల్స్‌ పర్యటన చేపట్టిన ఆయన సోమవారం జరిగిన సమాఖ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సీఏఏ, అధికరణ 370 రద్దుని కొన్ని దేశాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని జైశంకర్‌ సభ్యులకు వివరించారు. సీఏఏ వివక్షాపూరితంగా, కొన్ని వర్గాల మధ్య విభజనకు కారణయ్యేదిగా ఉందంటూ ఇటీవల ఈయూలో కొంతమంది సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జైశంకర్‌ అదే వేదికపై వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐరోపా దేశాల్లో అమలవుతున్న ‘ఇమ్మిగ్రేషన్‌ అడ్‌ రిఫ్యూజీ రీసెటిల్‌మెంట్‌’ విధానాలతో సీఏఏని పోల్చి వివరించారు. చాలా ఈయూ దేశాలు సంస్కృతి, జాతీయతను పౌరసత్వానికి ప్రాతిపదికగా తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. 

ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరునూ జైశంకర్‌ ఈయూ సభ్యులకు వివరించారు. భారత్‌కు పొరుగున ఉన్న దేశంలో ఇస్లాం అధికారిక మతంగా ఉందని..అక్కడి మైనారిటీలపై అకృత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. అందుకే అక్కడి వారు భారత్‌లో ఆశ్రయం కోరుతూ వస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా భారత్‌, ఈయూ మధ్య సంబంధాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను కూడా జైశంకర్‌ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని