
1800 దాటిన కరోనా మృతులు
బీజింగ్: చైనాలో కరోనా వైరస్(కొవిడ్-19) బారిన పడి మరణించిన వారి సంఖ్య 1800 దాటింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో సోమవారం 93 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1863కు చేరింది. మరో 1,807 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 72,300 తాకింది. ఆదివారంతో పోలిస్తే మరణాలు, కొత్తగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య తగ్గడం గమనార్హం. హుబెయ్ వెలుపల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. దీంతో తాము తీసుకుంటున్న చర్యలు సత్ఫలిస్తున్నాయన్నారు. అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఇప్పటి వరకు 10,615 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.
* కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ఏటా నిర్వహించే వార్షిక పార్లమెంటరీ సమావేశాన్ని వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఇది మార్చి తొలివారంలో జరగాల్సి ఉంది. చైనాలో జరిగే అతిపెద్ద రాజకీయ సమావేశం ఇదే కావడం గమనార్హం.
* జపాన్ నౌకలో వైరస్ బారిన పడ్డ అమెరికన్లలో 13 మంది పరిస్థితి ఆందోళనకంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి యూనివర్సిటీ ఆఫ్ నెబ్రస్కాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో చికిత్స అందజేస్తున్నారు. నౌకలో ఉన్న 338 మంది అమెరికన్లను అక్కడి ప్రభుత్వం రెండు విమానాల్లో అమెరికాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వీరందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైరస్ బారిన పడ్డ మరో 40 మంది జపాన్‌లోనే చికిత్స పొందుతున్నారు.
* మహారాష్ట్రలో 64 మంది కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరందరినీ ఇళ్లకు పంపారు. మరో ఐదుగురిని ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు.
Advertisement