అసత్యప్రచారాలపై యూఏపీఏ కేసులు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో సామాజిక మాథ్యమాలపై ఆంక్షలున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీటిని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.

Published : 19 Feb 2020 00:55 IST

 

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీటిని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ కొందరు వేర్పాటువాదులు కొత్తదారులు వెతుక్కుంటూ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. ఇలా కొందరు అసత్యప్రచారాలతో లోయలో అల్లర్లు సృష్టించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు పోలీసులు పసిగట్టారు. దీనిపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. తాజాగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదుచేశారు. అయితే ఈ కేసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ), ఐటీ చట్టం కింద నమోదు చేస్తుండటంతో విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ పోలీసులు స్పష్టతనిచ్చారు.
 

సామాజిక మాధ్యమాలు ఉపయోగించే వారందరిపై కేసులు నమోదు చేయడం లేదని.. కేవలం వీటిని దుర్వినియోగం చేస్తున్న వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై నిషేదం ఉన్నప్పటికీ.. అనుమతి లేని వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌ ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నట్లు కనుగొన్నామని వెల్లడించారు. వేర్పాటువాద భావజాలంతో కశ్మీర్‌ ప్రజలను రోచ్చగొడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించామని తెలిపారు. ఇలా అసత్యప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. 

అయితే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ దుర్వినియోగపరుస్తున్నారనే కారణంతో జనవరి 14న అక్కడి ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. కేవలం 2జీ ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులో ఉంచారు. సామాజిక మాధ్యమాలు మినహా ప్రభుత్వం పేర్కొన్న 1485 వెబ్‌సైట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు సూచించింది. కానీ, కొందరు వేర్పాటువాదులు మాత్రం వర్చువల్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతను ఉపయోగించి సామాజిక మాధ్యమాలను వాడుతూ అసత్యప్రచారాలు చేస్తూ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే అధికారుల చర్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఖండించారు. కశ్మీర్‌లో అంతా సవ్యంగానే ఉంది..నిజంగానే ఉందా? అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని