‘గాంధీ.. గాడ్సే కలిసుండలేరు’

ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిశోర్‌ తన తదుపరి కార్యాచరణ ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని, తన జీవితం ...

Updated : 18 Feb 2020 15:06 IST

నితీశ్ కుమార్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ ఘాటు విమర్శలు

పట్నా: ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిశోర్‌ తన తదుపరి కార్యాచరణ ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని, తన జీవితం బిహార్‌కే అంకితమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ‘బాత్‌ బిహార్‌ కీ’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నితీశ్‌ తనకు తండ్రిలాంటివారని అంటూనే.. ఆయన ఎన్డీయేతో చేతులు కలపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 

‘పార్టీ సిద్ధాంతాల గురించి నాకు, నితీశ్‌కు మధ్య చాలా చర్చ జరిగేది. గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలను పార్టీ ఎన్నటికీ వీడబోదని సీఎం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు గాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో(ఎన్డీయేను ఉద్దేశిస్తూ) పార్టీ కలిసి పనిచేస్తోంది. నా వరకైతే.. గాంధీజీ గాడ్సే కలిసిమెలిసి ఉండలేరు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పుకొచ్చారు. 

అభివృద్ధి కోసమే ‘బాత్ బిహార్‌ కీ’

బిహార్‌ అభివృద్ధి గురించి నితీశ్‌ కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. 2005 నుంచి 2015 వరకు బిహార్‌ చాలా తక్కువ అభివృద్ధి జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని కిశోర్‌ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బిహార్‌ ఇంకా అత్యంత వెనుకబడిన రాష్ట్రంగానే ఉందని ఆరోపించారు. బిహార్‌ మాత్రమే ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే బిహార్‌ అభివృద్ధి కోసం ఏం చేస్తారంటూ ప్రజలు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారని అన్నారు. దేశంలోని 10 ఉత్తమ రాష్ట్రాల్లో బిహార్‌ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ‘బాత్‌ బిహార్‌ కీ’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, 100 రోజుల్లో కోటి మంది యువతను కలుస్తామని తెలిపారు. 

నితీశ్ నిర్ణయాన్ని గౌరవిస్తా..

ఈ సందర్భంగా తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. ‘నితీశ్‌ నన్నెప్పుడూ కొడుకులా చూసుకునేవారు. ఆయన నాకు తండ్రితో సమానం. అందువల్ల ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను గౌరవిస్తా. ఆయనే నన్ను పార్టీలోకి తీసుకున్నారు. ఆయనే బహిష్కరించారు. అయినా నితీశ్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు’ అని చెప్పుకొచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని