2000కు చేరిన కరోనా మృతులు

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారితో చైనాలో మరణించిన వారి సంఖ్య 2000 దాటింది. బుధవారం మరో 136 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. వీరంతా వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న........

Published : 19 Feb 2020 10:23 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారితో చైనాలో మరణించిన వారి సంఖ్య 2000 దాటింది. బుధవారం మరో 136 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. వీరంతా వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సుకు చెందిన వారే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన 1,749 కేసులతో బాధితుల సంఖ్య 74,185కు ఎగబాకింది. వీరిలో 11,977 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 5,248 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటి వరకు 14,376 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. అయితే, బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిలో 1,716 మందికి వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక హాంకాంగ్‌లో 62 కేసులను నిర్ధారించారు. మకావులో 10, తైవాన్‌లో 22 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు చైనా వెలుపల 900 మందికి వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. హాంకాంగ్‌లో వైరస్‌ వల్ల మరొకరు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందినట్లైంది. ఫ్రాన్స్‌, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తైవాన్ దేశాల్లో ఇప్పటికే ఒక్కరు చొప్పున మరణించిన సంగతి తెలిసిందే.

నౌకలో ఉన్నవారికి విముక్తి...

జపాన్‌ తీరంలో నిలిచిపోయిన నౌకలో ఉన్నవారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. గత 14రోజులుగా వీరంతా నౌకలోనే ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటి వరకు 542 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. పలు దఫాల వైద్య పరీక్షల అనంతరం వైరస్ ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత 500 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. మరో 300 మంది అమెరికన్లను ఆ ప్రభుత్వం ఇప్పటికే సొంతదేశానికి తీసుకెళ్లింది. మరికొంత మందిని త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని