ట్రాఫిక్‌ జామ్‌ అయిందని ఫిర్యాదు చేస్తే..

ట్రాఫిక్‌ ఇబ్బందులతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే.. ‘మీరే కంట్రోల్‌ చేయండి’ అంటూ రెండు గంటలు ఆయనను ట్రాఫిక్‌

Published : 19 Feb 2020 14:11 IST

ఫిరోజాబాద్‌: ట్రాఫిక్‌ ఇబ్బందులతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే.. ‘మీరే కంట్రోల్‌ చేయండి’ అంటూ రెండు గంటలు ఆయనను ట్రాఫిక్‌ వాలంటీర్‌గా నియమించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఫిరోజాబాద్‌కు చెందిన సోను చౌహన్‌ అనే వ్యక్తి మంగళవారం పనిమీద బయటకు వెళ్తూ సుభాష్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో విసిగిపోయిన సోను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఆయనకు పోలీసుల నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘రెండు గంటల పాటు మీరే ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయండి’ అని సీనియర్‌ పోలీస్‌ అధికారి సచింద్ర పటేల్‌ సోనును కోరారు. అంతేగాక సోనును సర్కిల్‌ ఆఫీసర్‌ హోదాలో ట్రాఫిక్‌ వాలంటీర్‌గా నియమించారు. 

ఇక చేసేదేం లేక సోను ట్రాఫిక్‌ పోలీస్‌ యునిఫాం ధరించి రెండు గంటల పాటు విధులు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలను ఆపి చలాన్లు కూడా ఇచ్చారు. సోను వెంట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌దత్త్‌ శర్మ కూడా ఉన్నారు. ‘ట్రాఫిక్‌ పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం. సమస్యపై ప్రజలకు మరింత అవగాహన వస్తుంది’ అని శర్మ తెలిపారు. 

మరోవైపు సోను కూడా దీనిపై సానుకూలంగా స్పందించడం విశేషం. ‘దీనివల్ల ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల సమస్యలేంటో నాకు అర్థమైంది. మనం నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అనుభవంతో ఇకపై నేను మరింత బాధ్యతగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని