
అక్రమ ‘ఆధార్’ కార్డుదారులపై చర్యలు..
దిల్లీ: అక్రమ ఆధార్‌కార్డుదారులపై కొరడా ఝుళిపించే కార్యక్రమం మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమవలసదారులు పొందిన ఆధార్ కార్డుల ఏరివేతపై అధికారులు దృష్టి సారించారు. పోలీసుల నివేదిక ఆధారంగా హైదరాబాద్ ఆధార్ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 127 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత తనిఖీ ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవాసులకు అధికారులు ఆధార్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలు, రాయితీలతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటుండడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధార్ జారీ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే, ఇతర దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వలసవచ్చిన వారు కూడా ఆధార్ తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన నిర్బంధ తనిఖీలు, వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్ కార్డులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలతో యూఐడీఏఐకి నివేదించారు. దీని ఆధారంగా అధికారులు అక్రమ కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేశారు. ఏఏ ధ్రువపత్రాల ద్వారా ఆధార్ పొందారో వాటి ఒరిజినళ్లను తీసుకొని వచ్చి తమ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆధార్ పొందినట్లు తేలితే వాటిని రద్దు చేయనున్నారు. అయితే తాజా నోటీసులతో పౌరసత్వ సవరణ చట్ట అమలుకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement