ట్రంప్‌ పర్యటనకు ముందు కేంద్రం కీలకనిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఎంహెచ్‌ - 60 రోమియో మల్టీరోల్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్టు...

Updated : 20 Feb 2020 10:52 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఎంహెచ్‌ - 60 రోమియో మల్టీరోల్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. 2.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో అమెరికా నుంచి 24 హెలికాప్టర్ల కొనుగోలు చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. ఈ హెలికాప్టర్లను భారత నౌకాదళం కోసం కొనుగోలు చేయనున్నారు.

25న ట్రంప్‌, మోదీ కీలక చర్చలు: ష్రింగ్లా

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నత స్థాయి ప్రతినిధులతో కలిసి భారత పర్యటనకు వస్తున్నారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరగనున్న నమస్తే ట్రంప్‌ కార్యక్రమం కూడా అమెరికాలో గత ఏడాది హ్యూస్టన్‌ నగరంలో నిర్వహించిన  హౌడీ మోదీ లాంటిదేనన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. ట్రంప్‌ పర్యటన విశేషాలను వెల్లడించారు. ఫిబ్రవరి 25న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య విస్తృతమైన చర్చలు జరగనున్నాయని చెప్పారు. రక్షణ రంగం, వాణిజ్యం, ఉగ్రవాదం, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. 

ట్రంప్‌ దంపతులకు మోదీ విందు

అగ్రరాజ్య అధినేత ట్రంప్‌ దంపతులకు ప్రధాని మధ్యాహ్న భోజన విందు ఇవ్వనున్నారని హర్షవర్దన్‌ ష్రింగ్లా చెప్పారు. వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడంలో తొందరపాటు నిర్ణయాలతో కాకుండా దీర్ఘకాలిక దృక్పథంతోనే నిర్ణయాలు తీసుకొనేలా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌ పర్యటన సందర్భంగా కొన్ని రక్షణ ఒప్పందాలు ఫలప్రదమయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌, ఆగ్రా, దిల్లీలో వీరి పర్యటన కొనసాగనుంది. వీరితో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. 

రోడ్‌షోకు ఇండియా రోడ్‌షోగా పేరు

1947 నుంచి 2000 వరకు ముగ్గురు అమెరికా అధ్యక్షులు భారత్‌లో పర్యటించగా.. 2000 నుంచి 2020 మధ్య కాలంలో ఐదుగురు అగ్రరాజ్య అధినేతలు పర్యటించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎనిమిది నెలల కాలంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కావడం ఇది ఐదోసారి అని తెలిపారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు నిర్వహించనున్న రోడ్‌ షోకు ‘ఇండియా రోడ్‌షో’ అని నామకరణం చేసినట్టు వివరించారు. తాజ్‌మహల్‌ వద్ద ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ గంట సమయంపాటు గడుపుతారని ష్రింగ్లా వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని