నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నెల 16 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated : 20 Feb 2020 10:05 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నెల 16 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

గత సోమవారం వినయ్‌ శర్మ జైలు గది గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు జైలు వర్గాల సమాచారం. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వినయ్‌ శర్మను డిశ్చార్జ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. డెత్‌ వారెంట్‌ జారీ అయినప్పటి నుంచి వినయ్‌ శర్మ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండటంలేదని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ చెబుతున్నారు. కనీసం తన తల్లిని కూడా గుర్తించట్లేదన్నారు. అయితే జైలు అధికారులు మాత్రం న్యాయవాది ఆరోపణలను తోసిపుచ్చారు. శర్మ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, సైకోమెట్రీ పరీక్షల్లోనూ అతడు సానుకూలంగా స్పందించాడని వెల్లడించారు. వినయ్‌ శర్మ జైల్లో నిరాహార దీక్ష చేపట్టినట్లు ఇటీవల ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. 

దోషుల ప్రవర్తనలో మార్పు..

మరోవైపు కొత్త డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటి నుంచి దోషుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జైలు వార్డెన్‌, సిబ్బందితో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం మానేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉరితీత తేదీ దగ్గరపడుతుండటంతో దోషులపై మరింత నిఘా పెట్టారు. వారున్న జైలు గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

ఈ కేసులో ఉరి వాయిదా పడేలా దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరితీత ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా దోషులను మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాలంటూ దిల్లీ పాటియాలా కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని