అందుకే కేజ్రీవాల్ ఏ శాఖ తీసుకోలేదట...!

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం అనంతరం మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. పాతవారినే తిరిగి మంత్రులుగా కేబినెట్‌లో తీసుకున్నారు.....

Published : 20 Feb 2020 15:07 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్ పదవి చేపట్టిన తర్వాత పాతవారినే తిరిగి మంత్రులుగా కేబినెట్‌లో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్ని శాఖలను మంత్రులకు కేటాయించారు. మరోసారి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన దీని వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. ‘‘ఒక్క మంత్రిత్వశాఖ కూడా నా పరిధిలో ఉంచుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి నా సమాధానం - దిల్లీ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలనేది నా మొదటి ప్రాధాన్యం. నాకు వారు చాలా పెద్ద బాధ్యతలను అప్పగించారు. దానిని నేను సరిగా నిర్వహించాలి. అందుకే నేను ఏ శాఖ బాధ్యతలు స్వీకరించలేదు. అలా అయితేనే నేను అన్ని మంత్రిత్వశాఖలపై ఓ కన్నేసి ఉంచగలను. అలాకాకుండా ఏదైనా శాఖ బాధ్యతలు నాపై ఉంటే దానిపై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన పనులు ఇబ్బందుల్లో పడతాయి’’ అని హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేజ్రీవాల్ మీడియాతో వ్యాఖ్యానించారు.

దిల్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో అరవింద్‌ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం పై చర్చించినట్లు ఆయన భేటీ అనంతరం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని