చైనాలో తగ్గిన ‘కరోనా’ కేసులు

చైనాలో విజృంభించిన మహమ్మారి కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య బుధవారం గణనీయంగా పడిపోయింది. నిన్న దేశవ్యాప్తంగా

Updated : 20 Feb 2020 12:03 IST

2,100 దాటిన మృతుల సంఖ్య

జపాన్‌ నౌకలో ప్రయాణించిన ఇద్దరి మృతి

చైనా/టోక్యో: చైనాలో విజృంభించిన మహమ్మారి కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య బుధవారం గణనీయంగా పడిపోయింది. నిన్న దేశవ్యాప్తంగా 394 కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ గురువారం వెల్లడించింది. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది. ఇటీవలి కాలంలో ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం నిన్ననే. ఇదే సమయంలో బుధవారం మరో 114 మంది కొవిడ్‌కు బలయ్యారు. వీరిలో 108 మరణాలు ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. దీంతో కొవిడ్‌ మృతుల సంఖ్య 2,118కి పెరిగింది. 

మరిన్ని వివరాలు..

* కొవిడ్‌-19 ప్రభావం హుబెయ్‌, వుహాన్‌లోనే విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే 62,031 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. 

* బుధవారం మరో 1,779 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి బయటపడిన వారి సంఖ్య 16,155కు పెరిగింది. 

* హాంకాంగ్‌లో ఇప్పటివరకు 65 మందికి కొవిడ్‌ సోకింది. వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మకావ్‌లో 10, తైవాన్‌లో 24 కేసులు నమోదయ్యాయి. 

జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ప్రయాణించిన వారిలో ఇద్దరు వైరస్‌ సోకి మృతిచెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో నౌకలో ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. 

ఇక జపాన్‌ నౌకలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 621కి చేరింది. వైరస్‌ లేదని నిర్ధారణ అవడంతో బుధవారం మరో 443 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. 

* వైరస్‌ కారణంగా ఇరాక్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనా వెలుపల మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని