అమెరికా అధ్యక్షుడి భద్రత..ఇంతింత కాదయా..

అత్యంత శక్తిమంతమైన, ప్రభావవంతమైన నాయకుడైన అమెరికా అధ్యక్షుడి భద్రత ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉండాల్సిందేగా మరి!

Updated : 23 Feb 2020 17:03 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24న భారత్‌కు రానున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ రోడ్‌ షోలో పాల్గొని మోతెరా స్టేడియంను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన కోసం అగ్ర రాజ్యానికి చెందిన భద్రతా విమానం ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధినేత విదేశీ పర్యటనలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి? అందించే భద్రత ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల ముందు నుంచి ఈ కసరత్తు మొదలవుతుంది అనే అంశాలపై ప్రత్యేక కథనం మీ కోసం...

24X7 భద్రత... అక్కడకు వెళ్లినా కూడా...
అమెరికా అధ్యక్షుడి భద్రత గురించి ఏడాది పొడవునా అంటే 24X7 సీక్రెట్ సర్వీస్‌ ఏజెన్సీ పనిచేస్తూనే ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా దానిని పసికట్టేంత నిఘా పెడుతుంది. ఎంతలా అంటే అధ్యక్షుడు శౌచాలయానికి వెళ్లినా, ఆ పరిసరాలపై నిఘా వేస్తుందీ సంస్థ. అమెరికా అధ్యక్షుడు విదేశాలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే, ఆ పర్యటనపై మూడు నెలల ముందు నుంచీ కసరత్తు ప్రారంభింస్తుంది. భద్రతా పరమైన అంశాలపై స్థానిక ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుంది. దీని సిబ్బంది అధ్యక్షుడు విమానాశ్రయానికి చేరుకునే తరుణంలో అక్కడి పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. అనంతరం రోడ్డు మీద ట్రాఫిక్‌ లేకుండా చర్యలు తీసుకుంటారు. విమానాశ్రయం నుంచి కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని జాగిలాలతో తనిఖీ చేస్తారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. పర్యటనా ప్రదేశానికి అధ్యక్షుడు చేరుకునే కొద్దిరోజుల ముందే ఆయనకు అవసరమైన వివిధ రకాల వస్తువులు, సామగ్రితో కూడిన ఏడు విమానాలు అక్కడికి చేరుకుంటాయి. అందులో ఓ హెలికాప్టర్, ప్రత్యేకమైన కారు, సమాచార వ్యవస్థతో పాటు, అధికారులు, శ్వేతసౌధం సిబ్బంది ఉంటారు. అధ్యక్షుడి వాహన శ్రేణి వెళ్లే మార్గాన్ని లైవ్‌ రికార్డింగ్‌ చేసే ఏర్పాటు చేస్తారు. 

ఆహారం, వసతి ఇలా..
ఇక అధ్యక్షుడికి అందించే ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు భద్రతా సిబ్బంది. ఆహార పదార్థాలను సీక్రెట్‌ ఏజెంట్లు పరీక్షిస్తారు. వంటల తయారు చేసేందుకు ప్రత్యేకంగా వంటవారు, సిబ్బంది విదేశీ పర్యటనలకు అధ్యక్షుడి వెంటే వస్తారు. విదేశీ పర్యటనల్లో అధ్యక్షుడు బస చేసే ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అంతా బాగానే ఉందనుకుంటేనే అధ్యక్షుడు ఉండేందుకు అనుమతిస్తారు. అక్కడ అందించే అన్ని రకాల సేవలను ముందుగానే పరీక్షిస్తారు. ఆ భవనంలో ఎలివేటర్లు, ఆరోగ్యపరమైన సౌకర్యాలు వంటివి తప్పకుండా ఉండాలి. లిఫ్ట్‌లు, ఇతర యంత్రాలను మరమ్మతులు చేసే సిబ్బందిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. అధ్యక్షుడు ఒకవేళ ఏదైనా హోటల్లో బస చేసినట్టైతే అక్కడి సిబ్బంది వివరాలు తీసుకుంటారు. వారిలో నేర చరిత్ర ఉన్నవారిని విధుల్లోంచి తప్పిస్తారు. 

అధ్యక్షుడు ఉండే గదిలో పలురకాల భద్రతా పరికరాలను ముందే ఏర్పాటు చేస్తారు. కిటికీలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలను బిగిస్తారు. అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా వలయాన్ని దాటి వెళ్లకూడదు. ఏదైనా దాడి జరిగితే దానిని ఎదుర్కోవటానికి సీక్రెట్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. స్థానిక నేరచరితుల్నీ, గొడవలు సృష్టించే వారినీ, అనుమానాస్పద వ్యక్తులనూ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచిస్తారు. 

సీక్రెట్‌ కోడ్‌... మొగుల్‌, మ్యూస్‌
అధ్యక్షుడి రక్తానికి సరిపడే గ్రూపు రక్తాన్ని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు తమతో తీసుకు వస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి చికిత్స అందించాల్సి వచ్చినపుడు పది నిముషాల్లోనే తగిన ఏర్పాట్లు చేస్తారు. అధ్యక్షుడు ఆయనతో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడేందుకు ఓ సీక్రెట్‌ కోడ్‌ను రూపొందించుకుంటారు ఈ సీక్రెట్ ఏజెంట్లు. ఉదాహరణకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మొగల్‌ అని, ఆయన సతీమణి మెలానియాను మ్యూస్‌ అని వ్యవహరిస్తారు. 

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, ప్రభావవంతమైన నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు ఒకరు. ఆ పదవిలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు ఏ స్థాయిలో ఉంటాయో... ముప్పూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అటువంటి నేతకు భద్రత కల్పించటానికి ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉండాల్సిందేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని