కు.ని. చేయకుంటే జాబ్‌ కట్‌!

కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్ల విషయంలో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం....

Published : 21 Feb 2020 18:52 IST

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు

విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి

భోపాల్‌: కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్ల విషయంలో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పురుష హెల్త్‌ వర్కర్లు కనీసం ఒక్క కు.ని. ఆపరేషన్‌ కూడా నిర్వహించకుంటే ఉద్యోగం నుంచి తొలగించడమో, జీతం నిలిపివేయడమో చేస్తామని హెచ్చరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-4ను విడుదల చేసింది. అందులో మధ్యప్రదేశ్‌లో కేవలం 0.5 శాతం మందే కు.ని. ఆపరేషన్లకు ముందుకొచ్చారని పేర్కొంది. దీంతో ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర శాఖ ఫిబ్రవరి 11న ఉత్తర్వులు వెలువరించింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం లోపు ప్రతి హెల్త్‌ వర్కర్‌ కనీసం ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అయినా చేయాలని పేర్కొంది. లేకుంటే జీతం నిలిపివేయడం గానీ, బలవంతపు రిటైర్మెంట్‌ గానీ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్య అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు. 1975లో నిర్బంధ కుటుంబ నియంత్రణ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ‘‘ఎవరికీ నిర్బంధ కు.ని ఆపరేషన్లు చేయబోం. ఎవరిపైనా చర్యలు తీసుకోం. కేవలం అవగాహన కల్పించడానికే ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్వర్వులను మరోసారి పరిశీలిస్తాం’’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తులసీ సైలావత్‌ వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని