లక్షణాలు కనిపించకుండానే వ్యాపిస్తోన్న కరోనా..?

బీజింగ్‌: ఏదైనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టాలంటే మొదటగా దాన్ని గుర్తించడమే ఎంతో కీలకం. అయితే చైనాను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు కొత్తరూపంలో విజృంభిస్తోంది. దీన్ని గుర్తిచేందుకు వైరస్‌ లక్షణాలున్న వారికే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.

Updated : 22 Feb 2020 14:29 IST

వైరస్‌ లక్షణాలు లేకుండానే సోకుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడి..!

బీజింగ్‌: ఏదైనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టాలంటే మొదటగా దాన్ని గుర్తించడమే ఎంతో కీలకం. అయితే చైనాను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు కొత్తరూపంలో విజృంభిస్తోంది. దీన్ని గుర్తిచేందుకు వైరస్‌ లక్షణాలున్న వారికే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. వైరస్‌ లక్షణాలున్న వారినుంచే ఇది వ్యాప్తి చెందుతుందని ఇప్పటివరకూ భావిస్తుండగా.. లక్షణాలు బయటకు కనిపించకుండా కూడా ఇది వ్యాపిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. వైరస్‌ ఉన్న వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే చాపకిందనీరులా ఇతరులకు వ్యాపిస్తున్నట్లు తేలిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. వుహాన్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతిలో వైరస్‌ లక్షణాలు లేనప్పటికీ కరోనా వైరస్‌ నిర్ధారణ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌ను ఆ వైరస్‌ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే పట్టణానికి చెందిన ఓ యువతి(20) జనవరి 10న వుహాన్‌ నుంచి 675కి.మీ దూరంలో ఉన్న తన బంధువుల ఇంటికి చేరింది. ఈ యువతి వెళ్లిన అనంతరం ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురు అనారోగ్యానికి గురికావడం ప్రారంభమైంది. వీరందరిలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో తక్షణమే వైద్యపరీక్షలు నిర్వహించారు అధికారులు. వైద్యపరీక్షల్లో ఆ కుటుంబంలోని ఐదుగురికీ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్క సారిగా కంగుతిన్నారు. ఆ సమయంలో ఎటువంటి వైరస్‌ లక్షణాలు కనిపించని ఆ యువతని కూడా ప్రత్యేకంగా ఉంచి పరీక్షించారు. ఆమెకు దగ్గు, జ్వరం, కడుపునొప్పి, శ్వాసకోస ఇబ్బందులతోపాటు సీటీ స్కాన్‌లో కూడా ఎలాంటి సమస్యలేదనే తేల్చారు. ఫిబ్రవరి11 వరకు ఆ యువతికి కరోనా పాజిటీవ్‌ రానప్పటికీ తదనంతర పరీక్షల్లో మాత్రం కరోనా వైరస్‌ ఉందని తేలింది. దీంతో వైరస్‌ లక్షణాలు బయటికి కనిపించకుండా కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అనుమానించారు వైద్యులు. దీనిపై మరింత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వైరస్‌ లక్షణాలు బయటకి కనిపించకుండా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చారు.

విస్తృత వేగంతో ఈ వైరస్‌ వ్యాపించడానికి గల కారణాలను విశ్లేషిస్తూ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ తాజాగా పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. దీన్ని చూస్తుంటే.. వైరస్‌ లక్షణాలు కనిపించనప్పటికీ వైరస్‌ బారినపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరస్‌ ఉన్న ప్రాంతాల నుంచి లేని ప్రాంతాలకు సోకడానికి ఇదీ ఒక కారణంగా భావిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. అందుకే కొవిడ్‌-19 మరింత సవాల్‌ విసురుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే 26దేశాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా దాదాపు 2300 మరణించగా..75వేల మందికిపైగా దీని బారిన పడిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని