చూపు కోల్పోయిన ఏనుగుకు దారి చూపుతోంది

మధ్యప్రదేశ్‌లోని పన్నా జాతీయ పార్కులో ఉన్న ఈ ఏనుగు పేరు వత్సల. దాదాపు 90 నుంచి 100సంవత్సరాల వయసు ఉన్న ఈ ఏనుగు ప్రపంచంలోనే వృద్ధ ఏనుగుగా భావిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు

Published : 23 Feb 2020 02:18 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పన్నా జాతీయ పార్కులో ఉన్న ఈ ఏనుగు పేరు వత్సల. దాదాపు 90 నుంచి 100సంవత్సరాల వయసు ఉన్న ఈ ఏనుగు ప్రపంచంలోనే వృద్ధ ఏనుగుగా భావిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్న ఈ వృద్ధ ఏనుగుకు తాజాగా కనుచూపు కోల్పోవడంతో కష్లాలు మొదలయ్యాయి. దీనికి తోడు జీర్ణవ్యవస్థలో కూడా సమస్యలు ఉండటంతో ఆ గజరాజుకు బ్రతుకు భారంగా మారింది. ప్రస్తుతం పన్నా సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ ఏనుగుకు సరిగ్గా నడవలేని స్థితితో తనకు తాను రక్షించుకునే శక్తి కూడా లేదు. దీంతో ఇన్ని సంవత్సరాలు తనతో పాటు కలిసి తిరిగిన పిల్ల ఏనుగులే రక్షణగా నిలుస్తూ... పార్కులో తిరగడానికి సాయం చేస్తున్నాయి. కేవలం 3నుంచి పది సంవత్సరాల వయసున్న పిల్ల ఏనుగులు వత్సలకు తోడు నిలవడం చూసి జంతు సంరక్షణ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుకు కంటికి లెన్సులు అందుబాటులో లేని కారణంగా వత్సల తిరిగి కనుచూపు పొందే ఆస్కారం లేదంటున్నారు. 

ఏనుగు సాధారణ జీవితకాలం దాదాపు 60నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆసియా సంతతికి చెందిన ఏనుగులైతే 40నుంచి 50సంవత్సరాలే జీవిస్తాయి. అయితే ఆసియా సంతతికి చెందిన ఈ వత్సల 1972లో కేరళ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలించారు. అప్పటికే దీని వయసు 40నుంచి 50సంవత్సరాలు ఉంటుందని అంచనా. సాధారణంగా ఏనుగుల వయసును వాటి దంతాల ఆధారంగా అంచనా వేస్తారు. 60-70 సంవత్సరాలు రాగానే వాటికవే ఊడిపోతాయి. అయితే వత్సలకు మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే ఊడిపోవడంతో దానివయసు 90నుంచి 100ఏళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు పశువైద్యుడు డా.సంజీవ్‌ గుప్తా. పన్నా జాతీయ పార్కుకే వన్నెతెచ్చిన ‘వత్సల’ను చూడడానికి దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందంటున్నాడు బాలకుమార్‌ అనే మావటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని