నిర్భయ దోషి చెబుతున్నవన్నీ అబద్ధాలే..

తన ఆరోగ్యంపై నిర్భయ దోషి వినయ్‌ శర్మ చెబుతున్నవన్నీ అవాస్తవాలే అనే తిహాడ్‌ జైలు అధికారులు శనివారం దిల్లీ కోర్టుకు వివరించారు. వినయ్‌ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, తనకు మెరుగైన చికిత్స

Updated : 22 Feb 2020 18:32 IST

వినయ్‌శర్మ పిటిషన్‌ కొట్టివేసిన పటియాలా హౌస్‌ కోర్టు

దిల్లీ: తన ఆరోగ్యంపై నిర్భయ దోషి వినయ్‌ శర్మ చెబుతున్నవన్నీ అవాస్తవాలేననే తిహాడ్‌ జైలు అధికారులు శనివారం దిల్లీ కోర్టుకు వివరించారు. వినయ్‌ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, తనకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ దోషి తరఫు న్యాయవాది ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జైల్లో వినయ్‌ ఆత్మాహత్యాయత్నాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. వినయ్‌ కనీసం తన తల్లిని కూడా గుర్తించే స్థితిలో లేడని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో అధికారులు నేడు కోర్టుకు వివరణ ఇచ్చారు. 

‘దోషి చెబుతున్నదంతా అవాస్తవాల పుట్ట. వినయ్‌ జైలు గోడకు బాదుకున్న మాట నిజమే. అది కావాలని చేసిన పనే. ఆ ఘటనలో అతడికి గాయమవగా.. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. డిఫెన్స్‌ లాయర్‌ చెబుతున్నట్లుగా వినయ్‌కు ఎలాంటి ఫ్రాక్చర్‌ కాలేదు. ఇక అతడికి ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని మెడికల్‌ రికార్డులు చెబుతున్నాయి. ఏ ఆసుపత్రిలోనూ చూపించాల్సిన అవసరం లేదు. జైలు వైద్యుడు రోజూ వినయ్‌ను పరీక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అతడు తన తల్లి, న్యాయవాదితో మాట్లాడాడు. అలాంటప్పుడు తల్లిని గుర్తించడం లేదని ఎలా చెబుతారు?’ అని జైలు అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసింది. 

పలు వాయిదాల అనంతరం నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీసేందుకు ఈ నెల 17న దిల్లీ కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ఉరితీతను వాయిదా వేసేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత సోమవారం దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ జైల్లో ఆత్మహత్యకు యత్నించాడు. జైలు గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. దీంతో అతడికి చికిత్స అందించారు. అయితే ఈ ఘటన తర్వాత వినయ్‌ తన తల్లిని గుర్తించలేదని, అతడి మానసిక పరిస్థితి కూడా క్షీణించిందని దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఆరోపించారు. అతడికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని