ఎట్టకేలకు తెరుచుకున్న షాహీన్‌బాగ్‌ రహదారి

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని నిరసనకారులు శనివారం తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 22 Feb 2020 19:08 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఏదేమైనప్పటికీ వారు తీసుకున్న నిర్ణయానికి పోలీసులు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ మాట్లాడుతూ.. 9వ నంబర్‌ రహదారిని నిరసనకారులు తాజాగా పునఃప్రారంభించారు. కానీ, నిరసనకారుల నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)కు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో గత 70 రోజులుగా స్థానికులు, పలువురు నిరసనకారులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనలకు ఇదే ప్రధాన కేంద్రంగా మారడంతో దిల్లీలోని జామియా నుంచి నోయిడాకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడం గమనార్హం. ఈ క్రమంలో నిరసనల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుండటంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు చేయవచ్చని పేర్కొంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించింది. ఆందోళన వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచిస్తూ వారితో మాట్లాడేందుకు సీనియర్‌ న్యాయవాదులతో మధ్యవర్తుల బృందాన్ని నియమించింది. వారు ఇటీవల ఆందోళనల వేదిక వద్దకు వెళ్లి నిరసనకారులతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని