
వారు త్వరగా విడుదలవ్వాలని ప్రార్థిస్తున్నా:రాజ్నాథ్
దిల్లీ: నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు వీలైనంత తర్వగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నానని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికరణ 370 రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు నిర్బంధంలో ఉంచారు. అనంతరం సెప్టెంబరులో ఫరూఖ్ అబ్దుల్లాపై, ఇటీవల మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) అమలు చేశారు.
కశ్మీర్లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొందని.. చాలా చోట్ల పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగవుతున్నకొద్దీ నిర్బంధంలో ఉన్నవారి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అధికరణ 370 రద్దును సమర్థించిన ఆయన కశ్మీర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.