‘భారత విరోధి’ మహతిర్‌ రాజీనామా

మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రెండు వాక్యాలతో తన రాజీనామా లేఖను మలేషియా రాజుకు పంపారు. ప్రధాని పదవికి .........

Updated : 24 Feb 2020 16:31 IST

కౌలలాంపూర్‌: మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రెండు వాక్యాలతో కూడిన తన రాజీనామా లేఖను మలేషియా రాజుకు పంపారు. ప్రధాని పదవికి మహతిర్‌ రాజీనామా చేసినట్టు ఆయన కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది. ఆయన పార్టీ పర్తి ప్రబూమి బెర్సతు మలేషియా కూడా అధికార కూటమి నుంచి వైదొలిగినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో 94 ఏళ్ల మహతిర్‌ తన పదవికి రాజీనామా చేశారు. కూటమిలో మరో కీలక నేత అన్వర్‌ ఇబ్రహీంకు అధికార పగ్గాలు అప్పగించే అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనే ఈ రాజకీయ సంక్షోభానికి దారితీసినట్టు సమాచారం. మహతిర్‌ మహ్మద్‌, అన్వర్‌ ఇబ్రహీం మధ్య సుదీర్ఘకాలం రాజకీయ వైరుధ్యం ఉన్న విషయం తెలిసిందే. జకీర్‌ నాయక్‌ను భారత్‌కు అప్పగించకపోవడం.. కశ్మీర్‌ వ్యవహారంపై పాక్‌ తీరును సమర్థించడంతో పాటు సీఏఏపై భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం తదితర అంశాల్లో వివాదాస్పద వైఖరితో ఆయనకు భారత వ్యతిరేకిగా ముద్రపడింది.  

కీర్తి కాంక్షతో కశ్మీర్‌పై.. 

మహతిర్‌ మహమ్మద్‌ రాజీనామా భారత్‌-మలేసియా సంబంధాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. 94ఏళ్ల వయస్సులో ఇస్లామిక్‌ దేశాలకు నాయకత్వం వహించాలనే కీర్తి కాంక్షంతో కశ్మీర్‌ విషయంలో గుడ్డిగా పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చారు. జమ్మూ-కశ్మీర్‌ను భారత్‌ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ ప్రతినిధి సభలో మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఐరాస తీర్మానాలకు భారత్‌ వ్యతిరేకంగా వ్యవహరించిందని అవగాహనా రాహిత్యంగా మాట్లాడారు. ఈ సమస్యను భారత్-పాక్‌ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ ప్రభావం భారత్‌-మలేసియా సంబంధాలపై తీవ్రంగా పడింది. 

జకీర్‌ నాయక్‌ విషయంలో అబద్ధాలు!

వివాదాస్పద మత గురువు జకీర్‌ నాయక్‌ను మలేషియా భారత్‌కు అప్పగించకుండా కావాలని జాప్యం చేస్తోంది. కొన్నాళ్ల క్రితం రష్యాలో వ్లాది వాస్తోక్‌లో జరిగిన తూర్పు ఆర్థిక సదస్సుకు అతిథిగా హాజరైన మోదీ మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌తో భేటీ అయ్యారు. జకీర్‌ నాయక్‌ అప్పగింతపై చర్చించినట్లు భారత విదేశీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఆ సందర్భంలోనే విజయ్‌ గోఖలే వెల్లడించారు. ఈ విషయంపై భవిష్యత్తులో ఇరు దేశాధినేతలు సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారని తెలిపారు. తాజాగా అసలు జకీర్‌ అంశం చర్చకే రాలేదని మహ్మద్ తెలపడం గమనార్హం. ఇది భారత్‌ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టింది.

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు జకీర్‌ సహకారం అందించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. పీస్‌ టీవీ ద్వారా నిధులు సేకరించి వాటిని ఉగ్ర సంస్థలకు మళ్లించారన్న ఆరోపణల కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఇప్పటికే భారత్‌లోని ఆయన ఆస్తులను జప్తు చేశారు. పాస్‌పోర్టును రద్దు చేశారు. దీంతో మలేషియాకు పారిపోయి అక్కడే శాశ్వత నివాసం కోసం అనుమతులు పొందారు. అతన్ని అప్పగించాలని భారత ప్రభుత్వం పలుసార్లు మలేషియా అధికారుల్ని కోరింది. కానీ, ఆయనపై అక్కడ ఎలాంటి నేరారోపణలు లేని కారణంగా అప్పగించలేమని తొలుత నిరాకరించారు. అయితే దేశ వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారన్న పేరిట మలేషియాలోని పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో విచారణ జరిపారు. ఆయన ప్రసంగాల్ని నిషేధించారు.

అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి యత్నం..

కౌలాలంపూర్‌లో కొన్నాళ్ల కిందట జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న  మహతిర్‌.. భారత్‌లో కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంపై నోరుపారేసుకొన్నారు. ‘లౌకిక దేశం అని చెప్పుకునే భారత్‌ ఇప్పుడు కొందరు ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరం. భారత్‌ చేసినట్లుగా ఇక్కడ మేం కూడా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటాయి. అస్థిరత్వం నెలకొంటుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు బాధపడాల్సి ఉంటుంది’ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. 

మహతిర్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కూడా అప్పట్లో తీవ్రంగానే స్పందించింది. ‘మలేషియా ప్రధాని మరోసారి భారత అంతర్గత వ్యవహారంపై వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో మత పీడనకు గురై భారత ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. భారత పౌరులపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపించదు. ఒక్క భారతీయుడి పౌరసత్వం కూడా తొలగిపోదు. అందువల్ల వాస్తవంగా చూస్తే మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. నిజానిజాలు తెలుసుకోకుండా భారత అంతర్గత వ్యవహారాలపై మలేషియా స్పందించకపోవడమే మంచిది’ అని ఆతర్వాత నిరసన తెలిపింది. 

భారత వంటనూనె వర్తకుల సంఘం షాక్‌
భారత వంట నూనె వర్తకుల సంఘం కూడా అప్పట్లో మలేషియాకు  గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌ వ్యవహారంలో పాక్‌కు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మలేషియా నుంచి పామాయిల్‌ను కొనగోలు చేయొద్దని సభ్యులకు సూచించింది. ఈ మేరకు ముంబయిలో సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయవాద భావాలు అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ నిర్ణయం సూచిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తి దేశమైన మలేషియాకు ఇదో పెద్ద కుదుపు అని అన్నారు.  ఈ నిర్ణయంతో మలేషియా పరిశ్రమ గుండెకు దెబ్బ తగిలినట్టయింది. దీనికి మహతీర్‌ స్పందిస్తూ..  పామాయిల్‌ కొనుగోలు చేయకూడదంటూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము ప్రతిఘటించలేమని వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ కొద్దిసేపటికే  సీఏఏపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోపక్క నష్ట నివారణ చర్యల్లో భాగంగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) భారత్‌ నుంచి 49.20 మిలియన్‌ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెర కొనుగోలు చేయనున్నట్లు ఎంఎస్‌ఎం మలేషియా హోల్డింగ్స్‌ బెర్హాడ్‌ నిర్ణయించింది. ఆ తర్వాత కూడా మహతిర్‌ వ్యవహార శైలిలో పెద్దగా మార్పురాలేదు. భారత్‌తో ఒకప్పుడు మంచి సంబంధాలు ఉన్న మలేషియా విరోధిగా మారే పరిస్థితిని మహతిర్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు మహతిర్‌ పదవి నుంచి తప్పుకోవడంతో భారత్‌-మలేసియా సంబంధాలు పూర్వస్థితికి చేరుకొనే అవకాశం లభించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని