8 డాలర్లతో భారత్‌ నుంచి అమెరికా వచ్చి..

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తన పూర్వీకుల మూలాలున్న దేశ పర్యటనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని భారత సంతతికి చెందిన అమెరికన్‌ అజిత్ పాయ్‌ తెలిపారు. 47 ఏళ్ల అజిత్‌ పాయ్‌ ఫెడరల్......

Updated : 24 Feb 2020 14:40 IST

వాషింగ్టన్‌: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తన పూర్వీకుల మూలాలున్న దేశ పర్యటనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని భారత సంతతికి చెందిన అమెరికన్‌ అజిత్ పాయ్‌ తెలిపారు. 47 ఏళ్ల అజిత్‌ పాయ్‌ ఫెడరల్ కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ హోదాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 12 మంది అధికారుల బృందంలో సభ్యుడిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా ఆయన ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌. ఈ సందర్భంగా ఆయన తన తల్లిదండ్రుల భారతీయ మూలాలను గుర్తుచేసుకుంటూ భారత పర్యటనకు ముందు ట్విటర్లో వీడియో షేర్‌ చేశారు.

‘‘1971లో మా తల్లిదండ్రుల వివాహం జరిగింది. తర్వాత వాళ్లు 8 డాలర్లు, ట్రాన్సిస్టర్‌ రేడియో, అమెరికాలో జీవించాలనే కలతో ఇక్కడికి వచ్చారు. కానీ ఒక తరం తర్వాత వాళ్ల కుమారుడు అమెరికా అధ్యక్షుడి ఉన్నతస్థాయి అధికారుల బృందంతో కలిసి వారు పెరిగిన దేశంలో పర్యటిస్తాడని వారికి చెప్పి ఉంటే వారి స్పందన ఏ విధంగా ఉండేదోనని నాకు ఇప్పటకీ ఆశ్చర్యంగానే ఉంది. ఇది కేవలం నా అధికారిక పర్యటన మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా నేను దీని కోసం తను ఎంతో ఎదురుచూస్తున్నాను. మా తల్లి బెంగళూరులో, తండ్రి హైదరాబాద్‌లో పెరిగారు’’ అని అన్నారు. తన భారత్‌ పర్యటనలో 5జీతో పాటు డిజిటల్‌ విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే పురాతనమైన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్నేహ సంబంధాలు పెంపు లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని వెల్లడించారు.

‘‘ఎంతో మంది వలసదారులలానే వారికి లేని అవకాశాలను నాకు అందించేందుకు నా తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేశారు. మా పూర్వీకులే కష్టపడే తత్వాన్ని, ముందు చూపుతో కలలు కనడాన్ని నాకు నేర్పించారు. ఫెడరల్ కమ్యూనికేషన్‌ కమిషన్ మొదటి భారతీయ అమెరికన్‌ ఛైర్మన్‌గా, నా తల్లిదండ్రుల్లానే ఎంతో మంది వలసదారుల త్యాగాల పట్ల నేను ఎంతో బాధ్యతో వ్యవహరిస్తాను’’ అని పాయ్‌ అన్నారు. వాటితో పాటు పాయ్‌ 2019లో 1937లో తన తాతయ్య పాస్‌పోర్ట్‌తో పాటు, బెహ్రెయిన్‌లో ఆయన గుమస్తాగా పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని 2019లో తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు. అక్కడే తన తల్లి 1945లో జన్మించినట్లు తెలిపారు. ట్రంప్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్న అధికారుల బృందంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు అజిత్ పాయ్‌ కాగా, మరొకరు కేష్ పటేల్‌. ఈయన అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా, కౌంటర్‌ టెర్రరిజం సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని