దిల్లీ స్కూల్‌ను సందర్శించిన మెలానియా

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతుల భారత పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ నేడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొనగా అమెరికా ప్రథమ మహిళా మెలానియా దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను

Updated : 25 Feb 2020 14:57 IST

దిల్లీ: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతుల భారత పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ నేడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొనగా అమెరికా ప్రథమ మహిళా మెలానియా దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మెలానియా నుదుట కుంకుమ పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆమెను స్వాగతించారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులతో మెలానియా ముచ్చటించారు. ఇక్కడి హ్యాపీనెస్‌ తరగతులకు హాజరయ్యారు. తరగతి గదిలో కూర్చుని హ్యాపీనెస్‌ పాఠాలు విన్నారు. 

మరోవైపు ట్రంప్‌ వాణిజ్య చర్చల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధికారిక స్వాగతం పలికారు. అనంతరం వీరు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. అక్కడి నుంచి ట్రంప్‌ నేరుగా హైదరాబాద్‌ హౌస్‌కు వెళ్లి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం ఇరు దేశాధినేతల సంయుక్త ప్రకటన వెలువడనుంది. 

ఏంటీ.. హ్యాపీనెస్‌ తరగతులు..

ప్పుడూ చదువు... చదువు.. అని వెంటపడే పాఠశాలల్నే చూసుంటాం. కానీ దిల్లీలోని బడులు మాత్రం భిన్నంగా ఉంటాయి. హ్యాపీనెస్‌ కరికులం పేరుతో పిల్లలతో రకరకాల కార్యక్రమాలు చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఓ క్లాస్‌ ఉంటుంది. దీంట్లో పిల్లలు ఏమేం చేస్తారంటే...

* మనసును ప్రశాంతంగా మార్చుకోవడం కోసం కొంతసేపు ధ్యానం చేస్తారు. రెండు చేతులను బాగా రుద్దుకొని కళ్లపై పెట్టుకుంటారు. ఆ నిశ్శబ్దంలో ప్రకృతిలో జరిగే మార్పులు గమనిస్తారు. తమ గుండె చప్పుళ్లని వింటారు. శ్వాస మీద ధ్యాస పెడతారు.

* మనసుకు హద్దులు ఉండవు. అది ఎక్కడికైనా పయనించగలదు. అలా మనసు చెప్పే ఊసులని, మదిలో కలిగే భావాలను ఒక పెన్ను, పేపర్‌ తీసుకొని కాగితం మీద పెడతారు. వారికి కలుగుతున్న అనుభూతులు రాయడానికి, గీయడానికి ప్రయత్నిస్తారు.

* ఏ జంకూ లేకుండా స్నేహితులతో సరదాగా మాట్లాడతారు. కథలు చెప్పుకుంటారు. నాటకాలు వేస్తారు. ఒక అంశంపై మాట్లాడుతూ ఇది ఇలాగే ఎందుకు ఉండాలి... అలా ఉండకూడదా... అంటూ చర్చల్లోకి దిగుతారు. ఇవే కాదు.. మరెన్నో ఇండోర్‌ గేమ్స్‌ కూడా ఉంటాయి.

ఇవి లాభాలు...

ఈ హ్యాపీనెస్‌ కరికులం పిల్లల్లో ఉండే ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి సాయం చేస్తుంది. బృంద చర్చల ద్వారా ప్రశ్నించడం, శ్రద్ధగా వినడం, వారి భావాలు వివరంగా వ్యక్తపరచడం వంటివి అలవడతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్రిటికల్‌ థింకింగ్‌, సమస్య సాధన వంటివి తెలుస్తాయి.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఇదీ చదవండి.. మెలానియా పాఠశాల సందర్శనపై కేజ్రీవాల్‌ ట్వీట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని