దిల్లీ హింస: కేజ్రీవాల్‌తో అమిత్‌ షా కీలక భేటీ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతో ఈశాన్య దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు మోహరించినా హింసాత్మక ఘటనలు ఇంకా.......

Updated : 25 Feb 2020 17:38 IST

ఈశాన్య దిల్లీలో నెల పాటు 144సెక్షన్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతో  ఈశాన్య దిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు మోహరించినా హింసాత్మక ఘటనలు ఇంకా అదుపులోకి రావడంలేదు. మంగళవారం కూడా ఈశాన్య దిల్లీలోని పలు చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయి రాళ్లు రువ్వడంతో మరింత టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కీలక భేటీ నిర్వహించారు. దిల్లీలో నిన్నటి నుంచి జరిగిన హింసలో ఇప్పటివరకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అమిత్‌ షా నిర్వహించిన ఈ కీలక భేటీలో దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌, కాంగ్రెస్‌ నేత సుభాష్‌ చోప్రా, భాజపా నేత మనోజ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మరోవైపు, హింసాత్మక ప్రదేశాల్లో మరిన్ని పోలీసు బలగాలను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్రహ్మపురి, చాంద్‌పూర్‌, కార్వాల్‌నగర్‌, మౌజ్‌పూర్‌ సహా పలు ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించనున్నారు.  

నెల రోజులు 144 సెక్షన్‌ అమలు
హింసాత్మక ఘటనల నేపథ్యంలో విధించిన 144 సెక్షన్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. దీంతో మార్చి 24 వరకు ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. 

హింస ఆగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు: కేజ్రీవాల్‌
దిల్లీలో హింస ఆగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగిన భేటీ సానుకూలంగా జరిగిందని చెప్పారు. దిల్లీ నగరంలో శాంతి పునరుద్ధరణ జరిగేలా అన్ని రాజకీయ పార్టీలూ చర్యలు తీసుకొనేలా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేజ్రీవాల్‌ చెప్పారు. అమిత్‌ షాతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. దిల్లీ సరిహద్దు ప్రాంతాలను మూసివేయాలని ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకు  సూచించారు. బయటి నుంచి జనం వస్తున్నారనీ.. ఈ నేపథ్యంలో సరిహద్దులను మూసివేసి ఎక్కడివారిని అక్కడ నిలువరించాలన్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇదేం జాతీయవాదం?: కిషన్‌రెడ్డి ఆగ్రహం
ఈశాన్య దిల్లీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశం నుంచి ఎవరినీ బయటకు పంపే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ, విపక్షాలు మాత్రం దుష్ప్రచారం చేస్తూ అనవసర ఆందోళనలకు కారణమవుతున్నాయని మండిపడ్డారు. జనగణన అనేది మోదీ, భాజపా అజెండా కాదన్న ఆయన.. ఇది ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా జరిగేదని చెప్పారు. జాతీయ జెండాలు పట్టుకొని పోలీసులపై దాడి చేయడం జాతీయవాదమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని