
ఈ బంధం ప్రజలది..: మోదీ
అమెరికాతో సంబంధాలపై వ్యాఖ్య
ఇంటర్నెట్‌డెస్క్: భారత్-అమెరికా సంబంధాలు కేవలం ఇరు దేశాల మధ్యవే కావని.. ప్రజల మధ్యవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మొత్తం మూడు ఎంవోయూలు కుదుర్చుకొన్నారు. వీటిల్లో భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(అమెరికా) మధ్య ‘మానసిక ఆరోగ్యం’పై సహకారం కోసం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్(భారత్)- ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(అమెరికా) మధ్య ‘సేఫ్టీ ఆఫ్ మెడికల్ ప్రొడక్ట్స్’, ఇంధన రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అమెరికాకు చెందిన ఎగ్జాన్ మొబిల్‌ల మధ్య ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు సమావేశంలో మాట్లాడారు. తొలుత మోదీ మాట్లాడుతూ..
‘‘నమస్తే.. గత ఎనిమిది నెలల్లో అధ్యక్షుడి ట్రంప్‌తో ఇది ఐదోసారి భేటీ. నిన్న మోతెరాలో అద్భుతమైన స్వాగతం పలికాం. భారత్-అమెరికా సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాల మధ్యే కాదు.. ప్రజలు కోసం ప్రజలే కేంద్రంగా ఇవి సాగుతున్నాయి. 21వ శతాబ్దంలో అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఇది ఒకటి. నేడు అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి మా సంబంధాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. నేడు కీలక అంశాలపై పూర్తిగా చర్చించాము. రక్షణ, భద్రత, శక్తి, టెక్ సహకారం, గ్లోబెల్ కనెక్టివిటీ, వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.’
‘అమెరికా అత్యాధునిక ఆయుదాలు.. భారత్ రక్షణ ఆయుధాగారాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇరు పక్షాలకు చెందిన తయారీ యూనిట్లు సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాయి. నేడు భారత దళాలు అత్యధికంగా శిక్షణ కార్యక్రమాలు అమెరికా దళాలతో కలిసే నిర్వహిస్తున్నాయి. ఇదే విధంగా మా దేశాల భద్రత కోసం కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదులను కట్టడిచేయడానికి సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాం. దీంతోపాటు మాదద్రవ్యాల అక్రమ రవాణ, మాదకద్రవ్యాల ఉగ్రవాదంపై ఒప్పందాలు జరిగాయి. వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం కోసం ఒప్పందం జరిగింది. గ్యాస్, చమురు విషయంలో అమెరికా మాకు కీలక భాగస్వామిగా మారింది. అణు, పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో బంధం బలపడింది.’
‘21వ శతాబ్దాంలో వస్తున్న టెక్నాజీలపై సరికొత్త అడుగుపడింది. భారతీయ వృత్తి నిపుణులు అమెరికా టెక్నాలజీ, లీడర్ షిప్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాలు పారదర్శక, సంతులిత వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాయి. మా వాణిజ్య భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది. ఇంధన, పౌర విమాన, రక్షణ, ఉన్నత విద్యలోని నాలుగు రంగాల్లో కొన్నేళ్లలో 70 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. దీనిలో ట్రంప్ కృషి కూడా ఉంది. వచ్చే మరి కొన్నేళ్లలో ఇది మరింత పెరుగుతుంది. ఇక ద్వైపాక్షిక వాణిజ్య విషయంలో మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వారి మధ్య జరిగే ఒప్పందం ఆధారంగా న్యాయ సమస్యలను అధగమించి విస్తృతమైన వాణిజ్య ఒప్పందానికి తుదిరూపం ఇచ్చేలా చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉంది. మా సంబంధాలు ఇరు పక్షాలకే కాదు.. ప్రపంచానికీ మంచి చేస్తాయి. వీటిల్లో ప్రజల మధ్య ఉన్న సంబంధాలే ముఖ్యం. ఇందులో విద్యార్థులు, వృత్తినిపుణలదే కీలక పాత్ర. వృత్తి నిపుణులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఎంతో చేస్తున్నారు. నేను ట్రంప్‌ను ఒకటి కోరా.. మన వృత్తి నిపుణుల సామాజిక భద్రత ఇతర అంశాలపై చర్చలను కొనసాగించాలని కోరాను. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ యాత్ర కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను’’ అని అన్నారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు.