3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలు: ట్రంప్‌

భారత్‌లో తన పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. హైదరాబాద్‌ హౌస్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత మోదీ, ట్రంప్‌ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Updated : 25 Feb 2020 17:27 IST

దిల్లీ: తమ భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా మిగిలిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మూడు బిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం ఖరారైనట్లు ప్రకటించారు. అందులో భాగంగా అపాచీ, ఎంహెచ్‌60 రోమియో వంటి అధునాతన హెలికాప్టర్లను అందజేయనున్నామని వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. 5జీ సాంకేతికత, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించామని తెలిపారు. ఈరోజు దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పర్యటన తమకు ఎంతో ప్రత్యేకమైనదని.. భారత్‌లో తమకు లభించిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఆ దేశంతో కలిసి అమెరికా కృషి చేస్తోందన్నారు. సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరోధం వంటి అంశాల్లో ఆస్ట్రేలియా, జపాన్‌తోనూ ఇరుదేశాల సహకారం కొనసాగుతుందన్నారు. భారత్‌, అమెరికా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని ఈ సందర్భంగా ట్రంప్‌ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్ఠం చేయడం, రాజ్యాంగబద్ధంగా తమ పౌరులకు స్వేచ్ఛా, స్వాతంత్రాలు కల్పించడానికి ఉభయ దేశాలు కట్టుబడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మెరుగైన మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టడానికి బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌పై జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాలు జరపుతున్న చర్చల్లో ఎంతో పురోగతి సాధించామని తెలిపారు. త్వరలో గొప్ప ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్‌కు అమెరికా చేస్తున్న ఎగుమతుల్లో 60 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. నాణ్యమైన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు 500 శాతం పెరిగాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని