భారత్‌తో బంధం మరింత బలోపేతం:శ్వేతసౌధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా జరిగిందని శ్వేతసౌధం అభిప్రాయపడింది............

Published : 26 Feb 2020 10:45 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా జరిగిందని శ్వేతసౌధం అభిప్రాయపడింది. ఉభయ దేశాల్లో ఉద్యోగ సృష్టి జరిగేలా, సంక్షేమం పెంపొందించే దిశగా ఆర్థిక సంబంధాలు మెరగవుతున్నాయని తెలిపింది. భారత్‌లో ట్రంప్‌ పర్యటన పూర్తయిన నేపథ్యంలో బుధవారం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటన విశేషాలు, కుదిరిన ఒప్పందాలను ప్రస్తావించింది. ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్‌కు అమెరికా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఒక్క 2018లోనే 142 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని గుర్తుచేసింది. యూఎస్‌ ఇంధన ఎగుమతులకు భారత్‌ గమ్యస్థానంగా మారిందని.. దీంతో అమెరికాకు భారీ ఆదాయం లభిస్తోందని స్పష్టం చేసింది. 

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఇరుదేశాధినేతలు కృషి చేస్తున్నారని శ్వేతసౌధం తెలిపింది. ఇది ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ఉండనుందని అభిప్రాయపడింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని మరింత భద్రంగా మార్చే దిశగా ఇరు దేశాల మధ్యనున్న రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నారని పేర్కొంది. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల మాఫియాను నిరోధించడంలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. లక్షా 10 వేల మంది హాజరైన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ఇరుదేశాల మైత్రిని మరింత బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ట్రంప్ వివరించారని తెలిపింది. ఈ సందర్భంగా కుదిరిన రక్షణ ఒప్పందం, 5జీ సాంకేతికతపై చర్చను గుర్తుచేసింది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని