పాక్‌ తొలి వార్షిక కామెడీ షో

పాకిస్థాన్‌.. మానవ ప్రాణాలకు లెక్కాపత్రం లేని సైనిక రాజ్యం. ఇక్కడ ప్రాణనష్టానికి లెక్కే ఉండదు. అది అఫ్గాన్‌ యుద్ధంలో మరణించినా.. తమ సొంత సైనికులు కార్గిల్‌ ఆక్రమణకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినా..

Updated : 26 Feb 2020 12:37 IST

 బాలాకోట్‌ దాడులకు ఏడాది సందర్భంగా దాయాది తీరు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: పాకిస్థాన్‌.. మానవ ప్రాణాలకు లెక్కా పత్రం లేని సైనిక రాజ్యం. ఇక్కడ ప్రాణనష్టానికి లెక్కే ఉండదు. అది అఫ్గాన్‌ యుద్ధంలో మరణించినా.. తమ సొంత సైనికులు కార్గిల్‌ ఆక్రమణకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినా.. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి ప్రయత్నించి హతమైనా.. చనిపోయిన వారు తమ దేశస్థులు కాదని బుకాయిస్తుంటుంది. ఇక బాలాకోట్‌లో భారీ సంఖ్యలో జైషే ఉగ్రవాదులు మరణించినా.. అనంతర పరిణామాల్లో ఎఫ్‌-16 కూలినా.. తమకు ఏమాత్రం నష్టం జరగలేదని భారీగా ప్రచారం చేసుకొంది. భారత్‌ ఆధారాలు చూపించినా అదే తీరు కొనసాగించింది. ఇప్పుడు ఆ కామెడీషో కొనసాగింపును నిర్వహిస్తోంది.

బాలాకోట్‌లో జైషే శిబిరంపై భారత వైమానిక దళం విరుచుకుపడి నేటికి ఏడాది. ఈ నేపథ్యంలో అభినందన్‌ వర్థమాన్‌ విమానం నుంచి లభించిన నాలుగు క్షిపణి శకలాలను పాక్‌ ప్రభుత్వం అక్కడి మీడియాకు మరోసారి ప్రదర్శించింది. ఇది మరోసారి పాక్‌ తీరుపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అభినందన్‌కు వీర్‌చక్ర అవార్డు ఇవ్వడాన్ని ప్రశ్నించింది. ఇంత వరకు బాగానే ఉంది. పాక్‌ ప్రదర్శించిన నాలుగు క్షిపణి శకలాల్లో  కొన్నింట్లో వార్‌హెడ్‌(బాంబు) లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ వార్‌హెడ్‌ క్షిపణి మధ్య భాగంలో ఉంటుంది. కూలిన మిగ్‌-21 నుంచి వాటిని స్వాధీనం చేసుకొంటే వార్‌హెడ్‌ ఉండాలి. కానీ, పాక్‌ ప్రదర్శించిన వాటిలో లేవు. అంటే ఆ క్షిపణిని ప్రయోగించాక.. అది లక్ష్యాన్ని తాకాక మిగిలిన శకలాలను పాక్‌ ప్రదర్శిస్తోంది. 

పాక్‌ తన ఎఫ్‌-16 స్క్వాడ్రన్‌ లీడర్‌ హసన్‌ ఎం సిద్ధిఖీకి ‘తెమ్‌గా ఐ జుర్‌’ అవార్డును ప్రకటించింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. మిగ్‌-21 కూల్చాడన్న పేరుతో ఈ అవార్డు ఇస్తే సమర్థించుకోవడానికి సరైన కారణం ఉండేది. కానీ, అతను భారత సుఖోయ్‌-30 ఎంకేఐను(అవెంజర్‌-1) కూల్చాడని ప్రకటించుకొంది. పోనీ పాకిస్థాన్‌  దీనికి సమర్థింపుగా ఎటువంటి రాడార్‌ సిగ్నేచర్‌ను, ఫోరెన్సిక్‌, కమ్యూనికేషన్‌ ఆధారాలను ప్రకటించలేదు. సుఖోయ్‌తో  పోల్చుకుంటే అతితక్కువ సామర్థ్యం ఉన్న మిగ్‌-21ను కూల్చిన మొహమ్మద్‌ నుమాన్‌ అలీఖాన్‌కు అత్యున్నత ‘సితార-ఐ-జుర్‌’ అవార్డును  ప్రకటించింది. సుఖోయ్‌ను కూల్చేశాడని చెబుతున్న సిద్ధిఖీకి తక్కువ స్థాయి అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత పాక్‌ కూల్చామని చెప్పుకొన్న సుఖోయ్‌ విమానం అవెంజర్‌-1 భారత వాయుసేన దినోత్సవం సందర్భంగా ఠీవీగా నింగిలో ఎగిరింది. 

ఆ తర్వాత కూడా పాక్‌ వాయుసేన అధికారులు గొప్పలు చెప్పుకోవడం మానలేదు. భారత్‌ విమానాలు రాత్రిపూట దొంగచాటుగా వచ్చి దాడి చేశాయని.. తాము పగలు కావాలనే భారత ఆయుధాగారాల సమీపంలోనే బాంబులు వేశామని.. వాటిని లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. వాస్తవానికి ఈ సందర్భంగా వారు బ్లాక్‌ అండ్‌ వైట్‌ వీడియోను ప్రదర్శించారు. దీనికి నాటి భారత వాయుసేన చీఫ్‌ ధనోవా చెప్పిన జవాబుతో పాక్‌ పరవు పోయింది.. ‘‘రాత్రివేళ్లల్లో దాడులు చేయడానికి అదనపు సామర్థ్యం కావాలి.. భారత్‌కు అది ఉందని బాలాకోట్‌ దాడులు నిరూపించాయి. ఇరాక్‌పై అమెరికా దళాలు రాత్రివేళల్లోనే దాడి చేశాయి.. పాక్‌కు ఆ సామర్థ్యం లేదు. పైగా కలర్‌ వీడియో ఫుటేజీలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పాక్‌ ఇంకా బ్లాక్‌ అండ్‌వైట్‌ వీడియోలే చూపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు’’ అని తెలిపారు. భారత్‌ కూడా బాలాకోట్‌ ఘటన తర్వాత జరిగిన పరిణామాల నుంచి లోపాలను గ్రహించి సరిచేసుకోవడానికి  ఎక్కడా నామోషీ పడలేదు. మిగ్‌-21 కూలిందని.. ఫ్రెండ్లీ ఫైర్‌లో సొంత హెలికాప్టర్‌నే కోల్పోయామని చెప్పింది. ఎందుకంటే భారత్‌లో ప్రతిదానికి ప్రజలకు లెక్క చూపించాలి. అదే పాక్‌లో ఎఫ్‌-16 కూలినా.. దాని పైలట్‌ మరణించారని లండన్‌లోని వ్యక్తులు ట్వీట్‌ చేసినా.. భారత్‌  ఫాల్కన్‌ అవాక్స్‌ రాడార్‌ మిగ్‌-21తోపాటు ఎఫ్‌-16 విమానం కూడా రాడార్‌ తెరపై నుంచి అదృశ్యమైన  దృశ్యాన్ని బహిరంగానే ప్రదర్శించినా.. ఆ దేశం మాత్రం అంగీకరించలేదు.

మేము ఎంతో నేర్చుకొన్నాం..

‘‘ఏడాది గడిచింది. ఇప్పుడు మేం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తిగా ఉంది. బాలాకోట్‌ ఆపరేషన్‌ నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మేం చేపట్టే ఆపరేషన్లలో ఇది కీలకమైన మార్పు. పాక్‌ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరుపుతామని ఆ దేశం ఎన్నడూ ఊహించి కూడా ఉండదు. ఆ తర్వాత ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా బాలాకోట్‌ దాడి నిరోధకంగా పనిచేసింది’ అని ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ ధనోవా చెప్పుకొచ్చారు.

సామర్థ్యాన్ని మెరుగు పర్చుకునే పనిలో భారత్‌..

బాలాకోట్‌ దాడుల తర్వాత చాలా విషయాల్లో మెరుగవ్వాలని భారత్‌ గ్రహించింది. ముఖ్యంగా ఉపగ్రహ ఛాయాచిత్రాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొంది. భారత నిఘా నేత్రంగా రిశాట్‌ 2బీఆర్‌1 ప్రయోగించింది. ఇప్పటికే ఇస్రో రిశాట్‌ సిరీస్‌లో కొన్నింటిని ప్రయోగించింది. భారత దళాలకు కొన్ని ప్రదేశాల్లో నిరంతర నిఘా కోసం నాలుగు వరకు రిశాట్‌ సిరీస్‌ ఉపగ్రహాలు అవసరం. వీటిల్లోని ఎక్స్‌బ్యాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ నుంచి స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. పగలు, రాత్రి, మేఘావృతమైన వాతావరణంలో కూడా మంచి ఫిల్టర్లను వినియోగించి నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు