
దిల్లీలో పరిస్థితులు అదుపులోనే: ఢోబాల్
దిల్లీ: దిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ఢోబాల్ అన్నారు. ఈశాన్య దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పోలీసులు వారి పని వారు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 23 నుంచి ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అజిత్ ఢోబాల్ను రంగంలోకి దింపింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి
హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా కానిస్టేబుల్ మృతిచెందడం తనను బాధించిందని పేర్కొన్నారు. ఆయనకు అమరుడి హోదాను కల్పించడంతో పాటు ఆయన కుటుంబంలో ఓ వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
దిల్లీ ప్రజలు సోదరభావాన్ని పాటించాలి:మోదీ
1984లాంటి ఘటనలు పునరావృతం కానివ్వం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.