
ఉచిత ఫోన్లా? కరోనా వల్లే ఇవ్వలేకపోతున్నాం
అసెంబ్లీలో పంజాబ్ సీఎం ప్రకటన
చండీగఢ్: పంజాబ్‌లోని యువతకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కరోనా వల్లే అమలు చేయలేకపోతున్నామని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం సీఎం అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రకటించారు. చైనా కరోనాతో విలవిలలాడుతోందని.. అందుకే అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్లు రావడంలో జాప్యం నెలకొందన్నారు. ఫోన్లు రాగానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఎన్నికల మేం ఇచ్చిన హామీల్లో ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ఒకటి. అయితే, దానిలో కొంత జాప్యం జరిగింది. చైనాలో దాని ప్రభావం తగ్గగానే ఫోన్లు వస్తాయి. ఇందుకు నెలో, రెండు నెలలో, నాలుగు నెలలైనా పట్టవచ్చు’’ అని సభలో చెప్పారు.
గతేడాది సింగ్ జనవరి 26 కల్లా ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు చదివే విద్యార్థినులకు ఈ ఫోన్లు అందిస్తామని చెప్పారు. అయితే, రిపబ్లిక్‌డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. మార్చి 31నాటికి ఇస్తామని చెప్పడం గమనార్హం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని శిరోమణి అకాళీదళ్, భాజపా, ఆప్ పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
ఎన్నికలకు ముందు 2017లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీ జీవనవిధానంలో భాగమైపోయిందనీ.. దీన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.