చైనా, జపాన్ నుంచి భారతీయుల తరలింపు

కరోనా వైరస్‌ ప్రభావంతో జపాన్‌లోని డైమండ్ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకొన్న 119 భారతీయులు ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం దిల్లీకి చేరుకొన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ....

Updated : 27 Feb 2020 11:18 IST

దిల్లీ: కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ప్రబలిన జపాన్‌లోని డైమండ్ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించారు. వీరిని ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం దిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ట్విటర్లో ప్రకటించారు. ‘‘కొవిడ్ ప్రభావంతో జపాన్‌లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకొన్న 119 మంది భారతీయులతో సహా శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఐదుగురిని టోక్యో నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో నేడు దిల్లీకి తీసుకొచ్చాం. వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసిన జపాన్‌ అధికారులకు ధన్యవాదాలు, మరోసారి ఎయిరిండియాకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.

ఫిబ్రవరి 5వ తేదీన జపాన్‌కు చెందిన  డైమండ్ ప్రిన్సెస్‌ నౌకలో ఓ ప్రయాణికుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. అప్పటికి ఈ నౌకలో 3,711 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 138 భారతీయులు ఉండగా వారిలో 132 మంది సిబ్బంది మరో ఆరుగురు ప్రయాణికులు. వీరిలో 16 మందికి కరోనా సోకగా వారిని జపాన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మిగిలిన వారిని భారత్‌కు తరలించారు.

వుహాన్‌ నుంచి భారతీయలు తరలింపు
మరోపక్క కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనాకు భారత్ సాయం అందించింది. 15 టన్నుల వైద్య పరికరాలతో కూడిన వాయుసేన ప్రత్యేక విమానాన్ని బుధవారం చైనాలోని వుహాన్‌కు పంపింది. తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకొన్న 80 మంది భారతీయులు, 40 మంది
విదేశీయులను  భారత్‌కు తీసుకొచ్చినట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరందరిని దిల్లీలోని చావ్లా ప్రాంతంలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు భద్రత దళం (ఐటీబీపీ) ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. 

తాజాగా దక్షిణ కొరియాలో మరో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 1595కు చేరింది. వీరిలో 12 మంది మృత్యువాత పడ్డారు.  చైనా తర్వాత అధికంగా కరోనా బాధితులు నమోదవుతోంది ఇక్కడే.   చైనాలో బుధవారం మరో 433 మందికి కరోనా సోకగా 29 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో మృతుల సంఖ్య 2,744కి చేరింది. పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా కరోనా వ్యాపించింది. దీంతో ఆ దేశం చర్యలకు ఉపక్రమించింది. భారత పర్యటన అనంతరం అమెరికాకు చేరుకొన్న అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్ పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యక్షడు మైక్‌పెన్స్ నేతృత్వంలో అధికారుల బృందం కరోనా నిరోధక చర్యలపై పనిచేస్తుందని ప్రకటించారు.     
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని