దిల్లీ హైకోర్టు జడ్జీ బదిలీ.. సాధారణ ప్రక్రియే

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌ను బదిలీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సాధారణ బదిలీ

Updated : 12 Mar 2024 16:05 IST

కాంగ్రెస్‌ విమర్శల నేపథ్యంలో కేంద్రం స్పష్టత

దిల్లీ: ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ను బదిలీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు మార్చామని, ఇందుకు జడ్జీ నుంచి ముందస్తు సమ్మతి కూడా తీసుకున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

దిల్లీ అల్లర్లకు కారణమైనవారిని అరెస్టు చేయాలన్న అభ్యర్థనలపై నిన్న విచారణ జరిపిన జస్టిస్‌ మురళీధర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణ జరిగిన కాసేపటికే జస్టిస్‌ మురళీధర్‌ను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తిని బదిలీ చేసిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 

భాజపా నేతలను కాపాడేందుకే..

జస్టిస్‌ మురళీధర్‌ బదిలీపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఈ చర్యతో భాజపా ప్రతీకార రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. దిల్లీలోని భాజపా నేతలను కాపాడేందుకే న్యాయమూర్తిని బదిలీ చేశారు’ అని సుర్జేవాలా ఆరోపించారు. అటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ సీబీఐ న్యాయమూర్తి, దివంగత జస్టిస్‌ లోయాను గుర్తుచేసుకున్నారు. 

తిప్పికొట్టిన కేంద్రం..

న్యాయమూర్తి బదిలీపై కాంగ్రెస్‌ విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది. ‘ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు అనుగుణంగానే జస్టిస్‌ మురళీధర్‌ బదిలీ జరిగింది. దీనికి ఆయన సమ్మతి కూడా తీసుకున్నాం. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిన ప్రక్రియ. సాధారణ బదిలీని రాజకీయం చేస్తూ కాంగ్రెస్‌ మరోసారి తన తీరును ప్రదర్శించింది. దేశ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. అప్పటి నుంచి సంస్థలు, వ్యవస్థలపై దాడి చేస్తూ వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల తీర్పులను ఏ మాత్రం గౌరవించకుండా కొందరు వాటిని ప్రశ్నిస్తూ ఉంటారు. రాహుల్‌ గాంధీ ఏమైనా తాను సుప్రీంకోర్టు కంటే గొప్పవాడినని అనుకుంటున్నారా?’ అని వరుస ట్వీట్లలో కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చారు. 

అభ్యంతరకర ప్రసంగాలపై పాఠాలు చెప్పే హక్కు కాంగ్రెస్‌కు లేదని.. ఆ పార్టీ, కుటుంబం(గాంధీలను ఉద్దేశిస్తూ) ఇప్పటికే చాలా సార్లు కోర్టులు, సైన్యం, ప్రధాని సహా దేశ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రవిశంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. 

ఇదీ చదవండి..

దిల్లీ హింస: హైకోర్టు న్యాయమూర్తి బదిలీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని