‘అమిత్ షాను తక్షణమే తొలగించండి’

దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల పట్ల కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు మౌన ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. దిల్లీ ఘటనలపై సోనియా,

Published : 27 Feb 2020 14:23 IST

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం

దిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల పట్ల కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు మౌన ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. దిల్లీ ఘటనలపై సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను చదివి వినిపించారు. 

‘హింసాత్మక ఘటనల కారణంగా దిల్లీలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అల్లర్లపై కేంద్రం, కొత్తగా ఎన్నికైన దిల్లీ ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. హింసను అరికట్టకుండా అసమర్థంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే తొలగించాలి. ప్రజల ప్రాణాలు, వారి ఆస్తులు, హక్కులను పరిరక్షించాలి’ అని రాష్ట్రపతిని కోరినట్లు సోనియా తెలిపారు. దీనికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, తమ డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. 

అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘గత నాలుగు రోజులుగా దిల్లీలో నెలకొన్న పరిస్థితుల పై రాష్ట్రపతికి వివరించాం. ఈ అల్లర్లు యావత్‌ దేశానికి సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇవి అద్దం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి రాజధర్మాన్ని పరిరక్షించాలని కోరుతున్నాం’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని