కరోనా రుజువైతే లక్ష రివార్డు..!

షాంఘై: చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.  వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో దీన్ని గుర్తించేందుకు లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.

Updated : 27 Feb 2020 16:51 IST

  వైరస్‌ సోకిన వారికి నగదు అందిస్తోన్న చైనా అధికారులు

షాంఘై: చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.  వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో దీన్ని గుర్తించేందుకు లక్షలాది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న కరోనాను ఆదిలోనే గుర్తించి కట్టడి చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వుహాన్‌ వంటి చాలా ప్రాంతాల్లో అసాధారణ పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే లక్షణాలున్న వారిని వీలైనంత తొందరగా గుర్తించి వైద్య పరీక్షలు చేయాలని..ఇలా స్వచ్ఛందంగా వచ్చే వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. వైరస్‌ లక్షణాలున్నట్లు అధికారులకు తెలియజేసినా కూడా నగదు అందజేసి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వుహాన్‌ పరిసర ప్రాంతాల్లోని హాన్యాంగ్‌, హౌంగ్‌గవాంగ్‌తో పాటు చాలా పట్టణాలు 500నుంచి వెయ్యి యువాన్‌లను రివార్డుగా అందిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి వుహాన్‌కు 150కి.మీ దూరంలో ఉన్న క్వైన్‌జియాంగ్ పట్టణం కూడా చేరింది. కరోనా లక్షణాలున్న వారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇలా వచ్చిన వ్యక్తులకు వైరస్‌ ఉన్నట్లు రుజువైతే వారికి 10వేల యువాన్లు (దాదాపు లక్ష రూపాయలు)లను ఇస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటికే చికిత్స చేయించుకుంటున్న వారికి మాత్రం ఇది వర్తించదని తెలిపింది. అంతేకాదు, వైరస్‌ అనుమానిత వ్యక్తికి కూడా దాదాపు 2వేల యువాన్‌లు ఇస్తామని ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారు స్వయంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. చైనా వ్యాప్తంగా 2700మంది చనిపోవడంతోపాటు, వేల మందికి సోకిన ఈ వైరస్‌ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి అధికారులు.   
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని