మెలానియా కళ్లల్లో మెదులుతున్న దిల్లీ విద్యార్థులు..!

దిల్లీలో సర్వోదయ పాఠశాలలో హ్యాపీనెస్‌ తరగతులకు హాజరైన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఆ జ్ఞాపకాల్ని మరచిలేకపోతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘బీ బెస్ట్‌’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు.........

Updated : 28 Feb 2020 11:07 IST

సర్వోదయ పాఠశాల సందర్శన అనుభూతుల్ని గుర్తుచేసుకున్న ప్రథమ మహిళ

వాషింగ్టన్‌: దిల్లీలో సర్వోదయ పాఠశాలలో హ్యాపీనెస్‌ తరగతులకు హాజరైన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఆ జ్ఞాపకాల్ని మరచిలేకపోతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘బీ బెస్ట్‌’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు హ్యాపీనెస్‌ తరగతుల ఆశయం దగ్గరగా ఉండడం ఆమెని అమితంగా ఆకట్టుకుంది. ‘బీ బెస్ట్‌’ కార్యక్రమం అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అమలవుతోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. భారత సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికినందుకు పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్‌లో విద్యార్థులతో గడిపిన క్షణాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయంటూ పిల్లలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. గురువారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ‘‘భారత సంప్రదాయ పద్ధతిలో నుదుట తిలకం దిద్ది, హారతి ద్వారా నాకు స్వాగతం పలికినందుకు సర్వోదయ పాఠశాలకు కృతజ్ఞతలు. అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులు, బోధనా సిబ్బంది మధ్య ఉండే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. పాఠశాలలో గడిపిన క్షణాలన్నీ చిరస్మరణీయం’’ అంటూ మెలానియా సర్వోదయ పాఠశాల సందర్శనను గుర్తుచేసుకున్నారు. 

మెలానియా స్పందనపై సర్వోదయ పాఠశాల ఉపాధ్యాయురాలు మను గులాటీ ప్రతిట్వీట్‌ చేశారు. ప్రథమ మహిళ పాఠశాలకు రావడం తమ జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని సందర్భం అని వ్యాఖ్యానించారు. తమ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ అనుభూతిని పంచుకున్నారు. పాఠశాల పర్యటన జ్ఞాపకాలను మెలానియా ట్విటర్‌లో పంచుకోవడం విద్యార్థులకు ఇచ్చిన అతిపెద్ద బహుమానం అని వ్యాఖ్యానించారు. ప్రథమ మహిళ పర్యటన తమలో కొత్త ఆశయాల్ని, కలల్ని చిగురింపజేసిందన్నారు. నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. ప్రతి పిల్లవాడిని మరింత సంతోషంగా, దయాహృదయులుగా, హుషారుగా మార్చేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

గులాటీ వ్యాఖ్యలపై మెలానియా తిరిగి స్పందించారు. సర్వోదయ పాఠశాల పిల్లల్లోని ఆత్మవిశ్వాసం, వారి ముఖాల్లోని సంతోషం తనని ఆనందానికి గురిచేసిందన్నారు. అలాంటి వారికి గురువుగా ఉన్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్‌లోని ‘‘రీడింగ్‌ క్లాస్‌రూం, హ్యాపీనెస్‌ కరికులం’’తో స్ఫూర్తి పొందానన్నారు. ‘‘బీ బెస్ట్‌ ఆశయాలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండడం ఆనందంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాగంగా మెలానియా దిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ అమలవుతున్న హ్యాపీనెస్‌ తరగతుల్ని పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక తరగతుల్ని వీక్షించారు. పిల్లలతో కలిసిపోయి వారికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ, ఆలింగనం చేసుకుంటూ వారిని ఉత్సాహపరిచారు. సంప్రదాయ పద్ధతిలో బొట్టుపెట్టి, హారతి ద్వారా స్వాగతం పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరిగి పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లిన ఆమె ఇక్కడి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.

పిల్లల ఆనందమే లక్ష్యంగా ‘బీ బెస్ట్‌’...
పిల్లలు తమ తమ మార్గాల్లో పయనించేందుకు నాణ్యమైన మార్గనిర్దేశం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే ‘బీ బెస్ట్‌’. మే 7, 2018న మెలనియా దీనికి శ్వేతసౌధంలో శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీన్ని ‘బీ బెస్ట్‌’డేగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు, యువకుల్లో ఆన్‌లైన్ వేధింపులు, డ్రగ్స్‌ వాడకం దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భౌతికంగా, మానసికంగా దృఢంగా ఉంటూ తమ లక్ష్యఛేదనలో ముందుకు ఎలా సాగాలో వివిధ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నారు.

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని