‘మహా’లో ముస్లింలకు కోటా.. నేతల తలోమాట!

మహారాష్ట్రలోని విద్యా సంస్థల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా అఘాడీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి...

Published : 28 Feb 2020 19:08 IST

ముంబయి: మహారాష్ట్రలోని విద్యా సంస్థల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా అఘాడీ ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో దీనికి సంబంధించిన బిల్లును తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుడు లేవనెత్తిన ఓ ప్రశ్నకు శాసనమండలిలో ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. అయితే, అలాంటిదేమీ లేదని మరో మంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించడం గమనార్హం.

వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యేలోపు కోటాపై నిర్ణయం తీసుకోనున్నట్లు మాలిక్‌ తెలిపారు. కోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో భాజపా-శివసేన నేతృత్వంలోని గత సంకీర్ణ ప్రభుత్వం ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించలేదని చెప్పారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించే అంశంపైనా న్యాయ సలహాలు తీసుకోనున్నట్లు వివరించారు. అయితే కోటాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మరో మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. నవాబ్‌ మాలిక్‌ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ఈ విధంగా స్పందించడం గమనార్హం. దీనిపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని