కరోనా‌: ఆటో షో రద్దు.. స్కూళ్ల మూసివేత

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఓ వైపు చైనాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా.. చైనా వెలుపల సైతం...

Published : 29 Feb 2020 00:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో మొదలైన కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఓ వైపు చైనాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా.. చైనా వెలుపల సైతం మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. దీంతో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. జన జీవనం సైతం స్తంభించిపోతోంది. దీంతో ఆయా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా నిషేధం విధిస్తున్నాయి. కరోనా ప్రభావిత దేశాల నుంచి ప్రజలు రాకుండా ఆంక్షలు విధిస్తున్నాయి.


* ‘కరోనా’ దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి.  వరుసగా నష్టాల బాటలో పయనిస్తున్న సూచీలకు బ్లాక్‌ ఫ్రైడే మిగిలింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,448 పాయింట్లు నష్టపోయి 38,297 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 431.55 పాయింట్ల నష్టంతో 11,201.75 వద్ద స్థిరపడింది. (పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..)

* చైనా తర్వాత దక్షిణ కొరియాపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటి వరకు 2022 కేసులు నమోదు అవ్వగా.. 13 మంది మరణించారు.

* ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒక్క చైనాలో 78,824 కేసులు నమోదు అవ్వగా.. 2,788 మంది మరణించారు.


* కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెయ్యి మందికి పైగా గుమిగూడడానికి అవకాశమున్న కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. దీంతో మార్చి 5 నుంచి 15 వరకు జరిగే ప్రఖ్యాత జెనీవా ఇంటర్నేషనల్‌ మోటార్‌ షో సైతం రద్దయ్యింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టుకూ కరోనా సెగ తగిలింది. ఎవరెస్టును అధిరోహించే వారి సంఖ్య ఈ సారి భారీగా తగ్గనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. (పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..)


* కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 106 మందిని మహారాష్ట్రలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. జనవరి 18 నుంచి వారికి ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో 104 మందికి పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇద్దరి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

* హాంకాంగ్‌లో ఓ శునకానికి కరోనా వైరస్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో శునకాన్ని జంతువులకు సంబంధించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, శునకానికి సంబంధిత లక్షణాలేవీ లేనప్పటికీ పరీక్షలు ఎందుకు నిర్వహించారనేది తెలియరాలేదు.


* ఇరాన్‌లో మూడు రోజుల పాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలోని ఓ పవర్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు దక్షిణకొరియా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సూచించారు. సెలవులు ముగించుకుని ఈ నెల 25, 26 తేదీల్లో దక్షిణ కొరియా నుంచి వారు ఇక్కడికి వచ్చారు. 


* ఇరాన్‌, దక్షిణ కొరియాలో కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఆ దేశాల నుంచి వచ్చే వారిపై రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విద్య, ఉద్యోగం, పర్యాటకం కోసం వచ్చే వారి వీసాలను నిలిపివేసింది.

* ఇరాన్‌కు వెళ్లే విమానాలను పాక్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. సరిహద్దులను కూడా మూసి వేసింది.


*  కరోనా ప్రభావం హ్యుందాయ్‌ మోటార్స్‌పై  పడింది. దక్షిణ కొరియాలో ఆ సంస్థకు చెందిన కార్మికుడికి కరోనా వ్యాపించడంతో ఓ ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ ఫ్యాక్టరీ ఉల్సాన్‌లో ఉంది. ఈ విషయాన్ని హ్యుందాయ్‌ శుక్రవారం ప్రకటించింది. (పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి)

ఇదీ చదవండి..

చైనా వెలుపల విజృంభిస్తున్న కరోనా..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని