
ప్రయాణికుల్ని నౌకలో ఉంచడమే కొంపముంచిందా?
అవునంటున్న స్వీడన్‌కు చెందిన ఉమియా వర్సిటీ అధ్యయనం
ఉమియా(స్వీడన్): జపాన్‌కు చెందిన విహార నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’ని ప్రత్యేకంగా నిలిపి ఉంచడమే కొంపముంచిందని స్వీడన్‌లోని ఉమియా విశ్వవిద్యాలయం అధ్యయనమొకటి అభిప్రాయపడింది. యొకొహామా తీరానికి చేరిన వెంటనే అందులోని ప్రయాణికులను బయటకు తెచ్చి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ఉంటే కరోనా వైరస్(కొవిడ్-19) అంతలా వ్యాపించి ఉండేది కాదని చెప్పుకొచ్చింది. చైనాలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో కంటే నౌకలో వైరస్ చాలా వేగంగా వ్యాపించిందని అభిప్రాయపడింది. పరిమిత ప్రదేశంలో ప్రయాణికులు ఉండాల్సి రావడం.. వారు ఒకరికొకరు తరచూ తారసపడడం ప్రమాదాన్ని మరింత పెంచిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎపిడెమాలజీ విభాగం ప్రొఫెసర్ జొయాసిమ్ రాక్లోవ్ తెలిపారు.
నౌకలో ఉన్నవారిని ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 619 మందికి వైరస్ సోకగా.. నలుగురు మరణించారు. మరికొంత మంది ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏదేమైనా నౌక తీరానికి చేరిన వెంటనే వైరస్ లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఉంచడం కొంత మేలు చేసిందని ఉమియా అధ్యయనం అభిప్రాయపడింది. లేదంటే నౌకలో ఉన్నవారందరూ బాధితులుగా మారి ఉండేవారని అంచనా వేసింది. నౌకను ప్రత్యేకంగా నిలిపి ఉంచడం కంటే వారిని బయటకు తెచ్చి బాధితుల్ని, లక్షణాలు ఉన్నవారిని వేరు చేసి ఉంటే వైరస్ ఈ స్థాయిలో వ్యాపించి ఉండేది కాదని పేర్కొంది. అలా చేసి ఉంటే కేవలం 70 మందికి మాత్రమే వైరస్ బారిన పడి ఉండేవారని తెలిపింది.