
భారత్‌ను పొగడకుండా ఉండలేకపోతున్న ట్రంప్!
దిల్లీ: భారత్ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రజల ముందు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో వేలాది మంది అమెరికన్ల ముందు భారత్‌ను, ప్రధాని మోదీని కొనియాడారు. అహ్మదాబాద్‌లో మోతెరా మైదానంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జనం భారీగా హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
భారత పర్యటన ఫలవంతమైందని ట్రంప్ అన్నారు. భారత ప్రజలకు అద్భుతమైన నాయకుడు ఉన్నాడంటూ మోదీని ఉద్దేశిస్తూ అన్నారు. ‘‘భారత పర్యటనలో ఆ దేశ ప్రధాని మోదీతో కలిసి తిరిగాను. అయన చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ఆయన్ని బాగా అభిమానిస్తారు. మనకు అక్కడ గొప్ప ఆతిథ్యం లభించింది. జనం భారీగా తరలివచ్చారు. జనసందోహాన్ని నేను బాగా ఇష్టపడతాను. భారత్‌కు వెళ్లొచ్చిన నేను..ఇకపై ఇక్కడి జనసమూహాన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోకపోవచ్చు. ఇక్కడా భారీగానే వస్తున్నారు. భారత ప్రజలకు అమెరికా పట్ల ఎంతో అభిమానం ఉంది. వారికి గొప్ప నాయకుడు ఉన్నారు. పర్యటన చాలా ఫలప్రదంగా సాగింది’’ అంటూ భారత పర్యటన విశేషాలను ప్రజలకు వివరించారు.
ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో కలిసి భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. 36 గంటలపాటు సాగిన ఈ పర్యటనలో వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తాజ్‌మహల్ అందాల్ని ఆస్వాదించారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి వచ్చిన దాదాపు లక్షా 10 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.